Kids : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. ఇళ్లలో వాతావరణం తడిగా మారడంతోపాటు గోడలు తేమ బారాయి. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఫ్లూ భయం వెంటాడుతోంది. ప్రస్తుత వాతావరణంతో పిల్లలు ఫ్లూ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఓపీకి వచ్చే పిల్లల్లో 60 నుంచి 70 శాతం ఫ్లూ కేసులే ఉంటున్నాయని చెబుతున్నారు.
Kids : ఇటు స్వైన్ ఫ్లూ.. అటు డెంగీ..
జలుబు, దగ్గు, జ్వరంతో పాటు కొందరు చిన్నారుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు డెంగీ లక్షణాలు సైతం కొందరు చిన్నారుల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు చిన్నారుల్లో డెంగీ లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు జ్వరం వచ్చిన రెండు రోజులకు పరీక్షలు చేస్తే ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. అయితే డెంగీ తీవ్రత మాత్రం తగ్గిందని వెల్లడించారు. దీంతో చాలా మందికి ఓపీలోనే చికిత్సలు అందించి పంపిస్తున్నట్లు వివరిస్తున్నారు.
పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
పిల్లలను ఈ తరుణంలో వర్షంలో తడవనీయకూడదు. స్కూల్ నుంచి రాగానే దుస్తులు, షూ, సాక్స్ తొలగించి స్నానం చేయించాలి. వాతావరణం చల్లగా ఉంటే వేడి నీళ్లలో టవల్ ముంచి తుడవాలి. చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇంటి ఫుడ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే ఆహారం వేడిగా తీసుకోవాలి. ఇంట్లో కాచి వడ కట్టిన నీళ్లను పిల్లలకు ఇవ్వాలి. అస్వస్థతగా ఉన్న పెద్దలు పిల్లలకు కొంచెం దూరంగా ఉండాలి. వేసుకునే దుస్తులు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అయిదు నెలల లోపు పిల్లలను వెచ్చటి దుస్తులలో పడుకోబెట్టాలి. నవజాత శిశువుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. నెలల పిల్లలను బయటకు తీసుకురాకపోవడమే మేలు.