Kidney Care: శరీరంలోని ముఖ్యమైన భాగాలలో కిడ్నీలు ఒకటి. ముత్రపిండాల ఆరోగ్యంగా లేకపోతే.. ప్రమాదకర సమస్యలు ఉత్పన్నమవుతాయి. కిడ్నీలు మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి.. మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాల సమస్య ఉన్నవారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటంటే?
అధిక ఉప్పు, వైన్ తీసుకోవద్దు..
ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. ఉప్పులో సోడియం అధికమొత్తంలో ఉంటుంది.. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీకు ఏదైనా కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే ఉప్పు తీసుకోవడం చాలావరకు తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కిడ్నీపై ఆల్కహాల్ చెడు ప్రభావాలను కలిగిస్తుంది. మద్యం తాగేఅలవాటుతోపాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. వెంటనే దానిని ఆపాలి. మద్యం తాగడం వల్ల కిడ్నీ సమస్యలు మరింత పెరుగుతాయి.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినొద్దు..
కిడ్నీ పేషెంట్లు పొటాషియం ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు. ఇంకా కిడ్నీ సమస్యలు ఉంటే బంగాళదుంపలు, బత్తాయి వంటి వాటిని కూడా తీసుకోకూడదు. అరటిపండ్లు, అవకాడోలు తినడం కూడా కిడ్నీ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పొటాషియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది..
పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు. పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలను దెబ్బతీస్తాయి. పాల ఉత్పత్తులలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి, వాటిని ఎక్కువగా తీసుకోవడం మానుకుంటే మంచిది.
Kidney Care: అతిగా మాంసాహారం వద్దు
మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అలాంటి క్రమంలో మాంసాన్ని జీర్ణం చేయడం మన శరీరానికి కష్టమవుతుంది. అలాగే మార్కెట్‌లో లభించే స్వీట్లు, కుకీలు, పానీయాలలో కృత్రిమ తీపి పదార్ధాలు విరివిగా ఉపయోగిస్తారు. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.