Telangana : ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే అధికారం టీఆర్ఎస్‌దేనని ఓ సర్వే తేల్చేసింది. అయితే పార్టీ గ్రాఫ్ మాత్రం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆరా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తానికి సర్వే అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతానికి సానుకూలంగానే ఉంది. కానీ వెయిట్ అండ్ సీ ధోరణి మాత్రం టీఆర్ఎస్‌కు అస్సలు కలిసిరాదని కూడా సర్వే తేల్చేసింది. విషయాన్ని ముందే గ్రహించిన కేసీఆర్ ఇప్పటికే ముందస్తు హింట్ ఇచ్చేశారు. అంతేకాదు.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
Telangana : ఎన్నికల నాటికి 8% పడిపోనున్న టీఆర్ఎస్ గ్రాఫ్..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని ఆరా సంస్థ అధినేత మస్తాన్ పేర్కొన్నారు. ఇతరులు 6.91 శాతం ఓట్లు సాధిస్తారని తెలిపారు. ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది.. ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఉన్న ఓటింగ్‌లో 8 శాతం తగ్గుతుందని సర్వే వెల్లడించింది. మూడు దఫాలుగా నిర్వహించిన ఈ సర్వే 2021 నవంబరులో ప్రారంభమైంది. 40 నియోజకవర్గాల్లో, ఈ ఏడాది మార్చిలో మరో 40 , జూలైలో 39 స్థానాల్లో సర్వే చేశారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి నమూనాలు తీసుకున్నారు. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని చోట్ల సర్వే నిర్వహించారు. 2018 తర్వాత నుంచి టీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం పడిపోతున్న విషయాన్ని లెక్కలతో సహా వివరించారు.
ప్రస్తుతం ప్రజా సమస్యల కంటే కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి జరుగుతోందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. అలాగే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టివేశారని కేసీఆర్‌పై ఆరోపణలున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో కంటే పార్టీ క్యాడర్‌లోనే తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నాయని ఆరా అధినేత మస్తాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైపు పెన్షనర్లు, కొందరు మహిళలు మినహా అన్ని వర్గాలూ వ్యతిరేకంగానే ఉన్నాయి. వీటన్నింటి కారణంగా టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తానికి కేసీఆర్ కూడా విషయాన్ని ముందుగానే గ్రహించినట్టు తెలుస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం.