KCR: తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా పార్టీని గెలిపించాలని టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ఈసారి ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇక ఇదే అదునుగా మునుగోడులో గులాబీ జెండాను ఎగరేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశ్చయించారు. దీనికి తోడు గతంలో వచ్చిన వరుస వైఫల్యాలు కూడా మునుగోడు విషయంలో కేసీఆర్, గులాబీ పార్టీని మరింత కసిగా పని చేసేలా చేశాయి.
తెలంగాణ మంత్రులు అంతా మునుగోడుకే పరిమితం కాగా.. రాత్రిపగలు అక్కడే ఉండి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రుల్లో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులు మునుగోడులో మకాం వేసి మరీ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒక గ్రామం ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్నారంటే.. ఆ పార్టీ ఈ ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకుందనే విషయం అర్థమవుతుంది.
మునుగోడును ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ లోని చోటా, బడా లీడర్లు అంతా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈనెల 28, 29,30 తేదీల్లో మునుగోడులో ప్రచారం నిర్వహించనున్నారు. అక్టోబర్ 30వ తేదీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత ప్రచారాన్ని ముగించనున్నారు. అయితే ప్రచార గడువు అయిపోంత వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మునుగోడుకే పరిమితం కావాలని, కేటాయించిన గ్రామాల్లో ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
KCR:
అయితే కొందరు మాత్రం పగటి పూట ప్రచారం నిర్వహించి, రాత్రి హైదరాబాద్ కు వెళుతున్న నేపథ్యంలో వారి మీద కేసీఆర్ సీరియస్ అయ్యారట. ఎవరూ మునుగోడు వదిలి వెళ్లడానికి వీలు లేదని, అత్యవసర స్థితి అయితే తప్పితే మునుగోడు దాటడానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చాడట. ఇలా వెళ్లే వారి మీద రిపోర్ట్ కూడా తెప్పించుకుంటున్నారట. మొత్తానికి కేసీఆర్ వార్నింగ్ తో నేతలంతా ఇప్పుడు మునుగోడుకే పరిమితం అవుతున్నారు.