KCR: తెలంగాణలో అన్ని పార్టీలు ప్రాణం పెట్టి మునుగోడు బరిలో పోరాడుతున్నాయి. మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ్యాత్వానికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీయడంతో.. ఎలాగైనా మునుగోడును సొంతం చేసుకోవాలని గులాబీదళం గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు, మంత్రులను మునుగోడు గడ్డ మీద ప్రచారానికి దించింది. ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగరవెయ్యాలని మంత్రులు అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారు.
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి లాంటి వారితో పాటు పలువురు పార్టీ లీడర్లు మునుగోడులోనే మకాం వేశారు. పార్టీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న గులాబీదళం.. ప్రచారం చివరి రోజు భారీ సభను నిర్వహించాలని అనుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే అనుకోగా.. తాజాగా సభ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
KCR:
మునుగోడులో ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందనే విషయాలను కేసీఆర్ ఆరా తీస్తున్నారని.. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభ పెట్టడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందని గులాబీ బాస్ అనుకున్నారట. సభ పెట్టడం వల్ల ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, అలా కాకుండా నేతలతో ప్రస్తుతం చేస్తున్న ప్రచారాన్నే కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. కేసీఆర్ ఉప ఎన్నిక కోసం బరిలోకి తెచ్చామని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.