KBC Show: కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందు కూర్చుని రూ. కోటి గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. హాట్ సీట్ వరకు వెళ్లాలని చాలామంది కలలు కంటారు కానీ కొందరికి మాత్రమే ఆ కల సాకారమైతుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లాకు తాజా సీజన్‌లో అవకాశం లభించింది. ఇంటర్‌తోనే చదువు ఆపేసిన ఆమె కేబీసీ కోసం 21 సంవత్సరాల 10 నెలలుగా చదువుతూనే ఉంది. అంటే సుమారు 22 ఏళ్ల పాటు శ్రమించిన కవితా ఎట్టకేలకు కేబీసీ షోలో పాల్గొంది.
కేబీసీ 14 సీజన్‌లో కవిత హాట్ సీట్‌లోకి వెళ్లింది. అంతేకాదండోయ్.. ఏకంగా రూ. కోటి రూపాయలు గెలుచుకుంది. ఈ సీజన్‌లో ఆ ఘనత సాధించిన తొలి మహిళా కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ‘కేబీసీలో ఈ స్థానానికి చేరుకున్న మొదటి కొల్హాపూర్ వాసిని నేను. తాబేలు వేగంతో నడిచిన నేను మిలియనీర్‌గా మారాను. కేబీసీలో వెళ్లడానికి నేను 21 సంవత్సరాల 10 నెలలుగా ప్రయత్నిస్తున్నా. అన్ని సార్లూ నాకు నిరాశే ఎదురైంది. అయినా నేను ఆశ కోల్పోకుండా ప్రయత్నించాను. నేను చదువుకుంటుంటే మా అత్తగారు ఇంటిని చూసుకునేది. నా భర్త నాకు పుస్తకాలు కొని తెచ్చేవాడు’ అని వెల్లడించింది.
తన కొడుకుని ఒడిలో పెట్టుకుని 2000 సంవత్సరంలో కేబీసీ సీజన్ మొదటి ఎపిసోడ్ చూడడం ఇంకా గుర్తుందని తెలిపింది. ‘ఈ కార్యక్రమం నాకు ఎంతో నచ్చింది. ఎలాగైనా హాట్‌సీట్ చేరుకోవాలని కలలు కన్నాను. ప్రతి ఏడాది నేను కేబీసీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నా కానీ ఈ ఏడాది మాత్రం అనుకున్నది సాధించాను. 17వ ప్రశ్నకు జాక్‌పాట్‌కి చేరుకున్నా కానీ సరైన సమాధానం తెలియక కోటి రూపాయలు తీసుకుని ఆట నుంచి వచ్చాను’ అని కవిత తెలిపింది.