కార్తీక్‌ని ముంబై తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది మోనిత. కానీ వెళ్లేముందు దీప మీద కార్తీక్‌కి ఉన్న మంచి అభిప్రాయాన్ని తీసేయాలని అనుకుంటుంది. అందుకే కావాలని దీపని టిఫిన్ చేయమని చెబుతుంది. దీప తెచ్చిన టిఫిన్ తిని ఏదో అయినట్లు మోనిత నాటకం ఆడుతుంది. ఆమెని చెక్ చేసిన డాక్టర్ కూడా అందులో భాగమవుతాడు. అందుకే ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని అబద్ధం చెబుతాడు. దాంతో దీప మీద ఉన్నవి లేనివి ఎక్కించి చెబుతుంది. దాంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్, దీపని చెడామడా తిట్టేస్తాడు. ఇంకెప్పుడూ తన ముఖం చూపించొద్దని హెచ్చరిస్తాడు. దాంతో బాధపడిన దీప కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 7న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దీపని తిట్టిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లిన కార్తీక్.. మోనితని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. అనంతరం ఇంటికి వచ్చిన మోనిత ఆరోగ్యం బాగా లేనట్లు ఆస్కార్ రేంజ్‌లో నటిస్తుంది. తనకేం తెలియనట్లు దీప ఉందా లేదా అని అడుగుతుంది. దాంతో ఇంటికి తాళం వేసి ఉన్నట్లు డ్రైవర్ శివ చెబుతాడు. అది విని ఎందుకు అని ఏం తెలియనట్లు అడుగుతుంది మోనిత. తనే వార్నింగ్ ఇచ్చానని చెప్పి శివతో కలిసి భోజనం తీసుకురావడానికి బయటికి వెళతాడు కార్తీక్. దాంతో దీపని కార్తీక్ బయటి వ్యక్తి అనుకుని తిట్టడాన్ని ఊహించుకుని తెగ సంతోషపడిపోతుంది మోనిత.
ఇక తెల్లారగానే.. సౌర్య ఫొటోని చూసి హ్యపీ బర్త్ డే చెబుతూ ఎమోషనల్ అవుతుంది హిమ. ఇంతలో నాన్నమ్మ, తాతయ్యా రావడంతో.. విమానంలో వెళ్లి సౌర్యకి గిఫ్ట్ ఇచ్చి వద్దామంటుంది. దాంతో పుట్టినరోజున తన మనసు ఎందుకు చెడగొట్టడమని అంటుంది సౌందర్య. అనంతరం హిమని తీసుకుని అనాథాశ్రమానికి వెళతారు.
ఇంకోవైపు.. పుట్టినరోజు సందర్భంగా సౌర్య, హిమ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళుతుంది దీప. పూజారి పూజా చేస్తుండగా.. భర్తని పిల్లలని తన దగ్గరకి చేర్చూ అంటూ దేవుడిని వేడుకుంటుంది దీప. మరోవైపు.. కారులో వెళుతున్న హిమ.. తాత, నాన్నమ్మతో సౌర్య పుట్టినరోజు చేసుకుంటుందో లేదోనని బాధగా అంటుంది. దాంతో.. వచ్చే పుట్టినరోజు ఇద్దరూ కలిసి జరుపుకుందురుగానీ అని సముదాయిస్తాడు ఆనందరావు. ఇంతలో.. దీప ఉన్న గుడికే పూజ చేసేందుకు వెళుతుంది సౌర్య. ఆమెతోపాటు వారణాసి కూడా ఉంటాడు. తల్లి కూతుళ్లు ఒకే చోట ఉన్నప్పటి ఒకరిని ఒకరు చూసుకోరు. అనంతరం సౌర్య కూడా తన పేరు జ్వాల అని చెప్పి అర్చన చేయించుకుంటుంది. ఇంతలో కార్తీక్, మోనిత కూడా అదే గుడికి వస్తారు. దీపతో మరోసారి మాట్లాడనని దేవుడి మీద ప్రమాణం చేయమంటూ పట్టుబట్టి కార్తీక్‌ని గుడిలోకి తీసుకెళుతుంది మోనిత. వాళ్లిద్దరూ వచ్చేలోపు సౌర్య, వారణాసి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోతారు. కానీ.. దీప మాత్రం వారిద్దరినీ చూసేస్తుంది.
కార్తీక్‌ని బలవంతంగా గుడిలోకి తీసుకెళ్లి.. ‘ఈ రోజు నుంచి ఆ వంటలక్కని కలవనని, మాట్లాడనని ప్రమాణం చేయి కార్తీక్’ అంటూ దేవుడి మీద ఒట్టు పెట్టమంటుంది మోనిత. కార్తీక్ ప్రమాణం చేయబోతుండగా.. అక్కడే ఉన్న దీప ఆగమంటూ వెళ్లి ఆపేస్తుంది. ‘దీప నన్ను చంపడానికి ఫుడ్‌లో విషం కలిపింది కదా’ అందుకే ప్రమాణం చేయమని బలవంతం చేస్తుంటుంది. కార్తీక్ మాత్రం ప్రమాణం చేయాలా వద్దా అని సందేహంలో ఉంటాడు. ఇంతలో.. ‘నేను టిఫిన్‌లో ఏం కలపలేదు. కావాలంటే నేను దేవుడి మీద కాదు. నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను’ అని హారతి మీద ప్రమాణం చేస్తుంది దీప. దాంతో కావాలనే దీప అలా చేస్తోందని నానామాటలు అంటుంది మోనిత. అదివిని.. ‘తప్పు చేసిన వాళ్లు చేయలేదని ప్రమాణం చేయడం అంతా ఈజీ అయితే.. నువ్వు చెప్పేది నిజమని ప్రమాణం చేయ్యి’ అని లాజిక్ తీస్తుంది. అది విని కంగారుగా ఏం చేయాలా అని అటు ఇటు చూస్తున్నా మోనితకి గుడి బయట పూజ చేస్తున్న సౌర్య కనిపిస్తుంది. దాంతో.. ఇక్కడ సౌర్య ఉన్నట్లు దీపకి తెలుసా లేదా అని సందేహంగా అనుకుంటుంది మోనిత. ఇంతలో.. ‘నువ్వు చెప్పేది నిజమని ప్రమాణం చేయి అంటాడు’ కార్తీక్. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. గుడిలో నుంచి బయటికి వచ్చిన మోనిత.. ఇంకెప్పుడూ దీపతో మాట్లాడనని మాట ఇవ్వమని బలవంతం చేస్తుంది. దాంతో చీరెత్తుకొచ్చిన కార్తీక్.. మోనితని అక్కడే వదిలేసి కారులో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అడ్రెస్ తెలియకుండా ఎక్కడికి వెళతాడో అనుకుంటూ.. ఆటోలో ఇంటికి వెళుతుంది మోనిత. అక్కడ కార్తీక్ తలకి మర్ధన చేస్తుంటుంది దీప. అది చూసి మోనిత షాక్ అవుతుంది. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.