కార్తీక్‌ని వెతుకుతున్న దీపకి.. అతన్నే వెతుకుతున్న మోనిత కంటపడుతుంది. కార్తీక్ ఎక్కడ ఉన్నాడని దీపనే రివర్స్‌లో అడుగుతుంది మోనిత. అది విని విపరీతమైన కోపంతో ఊగిపోయిన దీప.. మోనితని చంపేస్తానని అంటుంది. అక్కడ సౌర్యని ఎలాగైనా వెతకాలని హిమ గొడవ చేయడంతో ఒప్పుకుంటుంది సౌందర్య. మరోవైపు కార్తీక్‌ని తీసుకెళ్లిన మహిళ అతన్ని ప్రతి విషయానికి కంట్రోల్ చేయడం అతనికి నచ్చదు. ఇదంతా అయ్యాక మోనితాని ఫాలో అవుతూ వెళుతుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం..
మోనితని ఫాలో అవుతూ ఇంటి వరకూ వెళ్లిపోతుంది దీప. అది తెలిసిన మోనిత ఏడుస్తూ కళ్లు మాటిమాటికి కళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. అది చూసి.. ‘అది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ కార్తీక్ ఉంటే దీన్ని చంపైనా తీసుకెళ్లిపోతా’ అని మనసులో అనుకుంటూ మోనిత వెనుకే ఇంట్లోకి వెళ్లి షాక్ అవుతుంది దీప. అక్కడ కార్తీక్ ఫొటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మోనిత. సంతోషంగా ఉండాల్సిన మనల్ని ఎందుకు విధి విడదీసుందని ఆవేదనగా మాట్లాడుతూ ఉంటుంది. అంతటితో ఆగకుండా ఒక్కసారి కనిపించు కార్తీక్ ప్లీజ్ అంటూ బాధపడుతుంది. ‘దీప చెప్పింది నిజమైతే.. నిన్ను తీసుకెళ్లింది ఎవరూ కార్తీక్.. నేను కాకుండా.. దీప కాకుండా.. నీ భార్యని చెప్పి ఎవరూ తీసుకెళ్లారు’ అని అంటూ గుండెలు అవిసెల ఏడుస్తుంది మోనిత. అంతటితో ఆగకుండా దీపనే కావాలని దూరం చేస్తుందా అంటూ నిందలు కూడా వేస్తుంది. ఒక్క క్షణం మోనిత చెప్పిందంతా నిజమే అనుకుంటుంది దీప. అయినా డౌట్ వచ్చి బెడ్‌రూమ్‌కి వెళ్లి చూడగా.. అక్కడా ‘నా కార్తీక్’ అని రాసి ఉంటుంది. దాంతో నిజంగానే మోనితకి తెలియదేమో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
అనంతరం.. సౌర్య ఇంతకుముందు అన్న మాటలను తలచుకుంటూ తనలో తానే కుమిలిపోతుంటుంది సౌందర్య. ‘ఓ వైపు సౌర్య రానంటుంది. ఇంకోవైపు హిమ ఊరుకోవట్లేదు. మమ్మల్నేందుకు ఇంత హింసపెడుతున్నావు’ అని దేవుడ్ని నిందిస్తుంది సౌందర్య. ఇంతలో.. సౌర్య కోసం బట్టలు, పిండి వంటలు తీసుకొస్తారు హిమ, ఆనందరావు. సౌందర్యని రెడీ అవ్వమని చెప్పి రెడీ అవ్వడానికి లోపలికి వెళుతుంటుంది హిమ. అంతలోనే.. ‘మనం సౌర్య దగ్గరకి వెళదామనుకున్నాం కదా.. ఎందుకు అలా బాధగా ఉన్నావు’ అని అడుగుతాడు. దానికి.. ‘సౌర్యకి హిమని కలవడం ఇష్టం లేదు. దాన్ని చూస్తే హిమ మీద ఉన్న కోపం కాస్తా ద్వేషంగా మారిపోతుంది’ అని బాధగా చెబుతుంది సౌందర్య. అది విని.. నేను రాను కానీ మీరు వెళ్లి అన్ని వస్తువులను సౌర్యకి ఇవ్వండని అంటుంది హిమ ఎమోషనల్‌గా.
తర్వాతి సీన్‌లో.. రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న దీప.. కారులో వెళుతున్నా కార్తీక్‌కి కనిపిస్తుంది. దాంతో శివని కారు ఆపమని.. ‘ఆమె మొన్న నన్ను ఏదో పేరుతో పిలిచింది. అదేంటో తెలుసుకోవాలి. మతిమరుపు వల్ల నేను ఆమెనే గుర్తు పట్టలేకపోయానా’ అంటూ దీప వైపు వెళుతుంటాడు కార్తీక్. ఇంతలోనే ఆటో ఎక్కి వెళ్లిపోతుంది దీప. చేసేదేంలేక అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు కార్తీక్.
తర్వాత.. రాంపండులని పిలిచి ఒకరు కూరగాయలకి, మరొకరు ఇంట్లోనే ఉండి దీపకి సహాయంగా ఉండండి అంటుంది డాక్టర్ అమ్మ. కానీ.. ఏం చేసిన ఇద్దరం కలిసే చేస్తామంటూ కూరగాయల కోసం మార్కెట్‌కి వెళతారు రాంపండులు. ఇంతలోనే దీప ఇంటికి వస్తుంది. అది చూసి.. నీ గురించే అనుకుంటున్నా.. డాక్టర్ బాబు కనిపించలేదా అని అడుగుతుంది ఆ పెద్దావిడ. ‘లేదు.. మోనిత కనిపించింది. అది నన్ను సాధించడానికి వచ్చిన పిశాచి. దానివల్ల చాలా బాధలు పడ్డాను’ అని ఎమోషనల్‌గా చెబుతుంది దీప. దాంతో.. ‘అలాంటి బుద్దులు ఉన్నవారు సుఖపడరు. డాక్టర్ బాబు మోనితకి దొరికిన దాన్నే తిడతారు. అది నీ మొగుడ్ని నీ నుంచి మాత్రం అది దూరం చేయలేదు’ ఓదార్పుగా మాట్లాడుతుంది పెద్దావిడ. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. శివ కాలర్ పట్టుకుని డాక్టర్ బాబు గురించి చెబుతావా లేక పోలీసులకి చెప్పానా అని బెదిరిస్తుంటుంది దీప. అదే సమయంలో మెడలో మంగళసూత్రంతో కార్తీక్‌కి గోరుముద్దలు తినిపిస్తుంటుంది మోనిత. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.