గత ఎపిసోడ్‌లో కార్తీక్‌ని వెతుకుంటూ వెళుతుంది దీప. ఫొటో చూసి కూడా తెలియదని అబద్దం చెబుతాడు శివ. అనంతరం ఎవరో చెబితే కార్తీక్ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది దీప. ఆమె వచ్చేలోపు కార్తీక్‌ని అక్కడి నుంచి తీసుకెళతాడు శివ. అనంతరం దీప కూరగాయలు తీసుకుంటుండగా.. కార్తీక్ కనిపిస్తాడు. డాక్టర్ బాబు అంటూ ప్రేమగా వెళ్లిన దీపని గుర్తుపట్టడు కార్తీక్. ఇంటికి వచ్చి అదే విషయాన్ని డాక్టర్‌కి చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది దీప. ఆ తర్వాత ఆగస్టు 23 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మరుసటి రోజు ఉదయం తెల్లవారిన కార్తీక్ నిద్రలేవకుండా పడుకునే ఉంటాడు. శివ అది గమనించి.. సార్ ఏంటి ఇంకా లేవలేదు అనుకుంటూ అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. కళ్లు తెరవకుండానే.. ‘హేయ్.. ఎవరయ్యా అది.. పొద్దుపొద్దున్నే.. నిద్రపోతుంటే లేపుతున్నారు..’ అంటాడు కార్తీక్ చిరాకుగా. ‘సార్ నేను సార్.. శివని.. చాలా టైమ్ అయ్యింది లేవండి సార్’ అంటాడు శివ. ‘తెల్లారి ఉంటే మీ మేడమ్ నన్ను పొడుకోనిస్తుందా? నేను లేవను’ అంటాడు కార్తీక్. ‘అవును కదా.. ఈ పాటికి నిద్ర లేవకపోతే మేడమ్ గోలగోల చేసేది.. కానీ మేడమ్ నాకు ఈ రోజు తను మౌనవ్రతం అని ఈ చీటీలో రాసి మరీ ఇచ్చింది.. ఒకవేళ మౌనవ్రతం అయినా సరే సార్‌ని తట్టి మరీ నిద్రలేపేది కానీ.. ఇంతసేపు నిద్ర పోనిచ్చేది కాదుగా? సార్ కూడా ఇంతవరకూ నిద్రపోయింది లేదు.. ఈ రోజు మాత్రమే ఎందుకిలా? మేడమ్ మౌనవ్రతానికి.. సార్ ఇంకా నిద్రలేవకపోవడానికి.. ఈ రోజుకి ఏదైనా సంబంధం ఉందా? ఈ రోజు స్పెషల్ ఏంటో’ అనుకుంటాడు శివ.
మరోవైపు దీప ఉంటున్న డాక్టర్ ఇంట్లో సెలబ్రేషన్స్ ప్రారంభిస్తారు. దీప, కార్తీక్ ఫొటో తయారు చేయించి కేక్ తెచ్చిపెట్టారు రెడీగా ఉంటారు డాక్టర్, డాక్టర్ తల్లి, రామ్, బంటు. ‘డాక్టర్ బాబు రావాలి.. డాక్టర్ బాబు రావాలి’ అని రామ్, బంటులతో నినాదాలు చేయిస్తూ.. దీపని కేక్ కట్ చేయమని చెబుతాడు డాక్టర్. దాంతో కేక్ కట్ చేసి అందరికీ ఇస్తుంది. మరోవైపు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ సౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. ఇంతలో.. ఆనందరావు వచ్చి హిమ ఎక్కడా ఉంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉందని అడుగుతాడు. ఇంతలో హిమ ఆవేశంగా వస్తూ ఉంటుంది. అది చూసి.. చూడండి ఎలా వస్తుందో.. ఏదో డిమాండ్‌తోనే వస్తుందని అంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వచ్చి.. సౌర్యని వెతుకుదాం పదండి అంటుంది హిమ. మనం వెళ్లిన సౌర్య రాదని జరిగిన విషయాన్ని చెబుతుంది సౌందర్య. దాంతో.. ‘సౌర్య దగ్గరకు వెళ్తున్నామా లేదా? వెళ్లకపోతే నేను ఏం తినను తాగను.. పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకోను. నేను కూడా సౌర్యలానే ఇంట్లోంచి పారిపోతాను’ అంటుంది. వెంటనే సౌందర్య హిమని లాగిపెట్టి కొడుతుంది. కానీ.. హిమ ఆరోగ్యం గురించి ఆలోచించి ఓకేనంటాడు ఆనందరావు. ‘థాంక్యూ తాతయ్యా’ అంటూ రెడీ అవ్వడానికి లోపలికి పరుగుతీస్తుంది.
తర్వాతి సీన్‌లో మార్కెట్‌లో కార్తీక్‌తో సంభాషణని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీప. అనంతరం.. ‘అది మీరే డాక్టర్ బాబు. అది కచ్చితంగా తెలుసు. మిమ్మల్ని ఏలాగైనా నా దగ్గరకి తెచ్చుకుంటాను’ అనుకుంటుంది మనసులో. అనంతరం కిందకి దిగి వచ్చి కార్తీక్‌ని వెతకడానికి వెళతానని చెబుతుంది. ఇంతలో కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. దాంతో.. మీరు నాకు దేవుడిచ్చిన బంధం అన్నయ్యా అంటూ ఎమోషనల్ అవుతుంది దీప. దాంతో డాక్టర్ బాబు కచ్చితంగా దొరుకుతాడని ఓదార్చుతారు తల్లికొడుకు. అనంతరం కార్తీక్‌ని వెతకడానికి వెళుతుంది దీప.
పొద్దున్నే లేచిన వెంటనే తల్లి, తండ్రి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది సౌర్య. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు, చంద్రమ్మ అక్కడికి వచ్చి.. ‘నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే.. మేం నిన్ను దత్తత తీసుకుని బాగా చూసుకోట్లేదు’ అనుకుంటారని అంటారు. అలా ఏం అనుకోరు బాబాయ్ అని అంటుంది సౌర్య. అనంతరం.. ‘అమ్మనాన్న చనిపోయి ఉంటే వారి బాడీస్ ఏదో ఒక ఆసుపత్రిలో దొరకాలి కదా. దొరకలేదు అంటే వాళ్లు బతికే ఉన్నారని అర్థం కదా’ అంటూ సౌర్య ఆశగా. దాంతో ఇంద్రుడు.. ‘సరే అమ్మా.. నువ్వు ఎలాగో ఆటో నేర్చుకుంటా అన్నావ్ కదా.. ఆటో కిరాయికి తీసుకుని ఆటో నడుపుతాను.. అదే ఆటోలో మనం మీ అమ్మనాన్నలని కూడా వెతుకుదాం..’ అంటూ అంటాడు ఇంద్రుడు. అనంతరం ముఖం కడుక్కొమని సౌర్యని పంపిస్తుంది చంద్రమ్మ.
అనంతరం చంద్రుడితో.. ‘పిల్లకు లేనిపోని ఆశలెందుకు పుట్టిస్తావ్ గండా.. అంతపెద్ద ప్రమాదం జరిగాక వాళ్లు ఇంకా బతికే ఉంటారా. మెల్లగా నచ్చచెప్పాలి కదా’ అంటూ ఇంద్రుడ్ని తిడుతుంది. ఆటో నడుపుతూ అన్ని మర్చిపోతుందని అలా చెప్పినట్లు చంద్రమ్మకి నచ్చచెబుతాడు ఇంద్రుడు. అనంతరం కార్తీక్‌ని వెతుకుతూ ఉంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం.. అంటూ దీప ముందు కార్తీక్ ఫొటో ఒకామె నిల్చుంటుంది. సరిగ్గా చూస్తే అది మరేవరో కాదు.. మన లేడీ విలన్ మోనితనే. దాంతో కార్తీక్ ఎక్కడా అని నిలదీస్తుంది దీప. అతనే ఉంటే నేనేందుకు ఇలా వెతుకుతూ ఉంటానని ఏడుస్తుంది మోనిత. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.