ఇంకా ఫ్లాష్‌బ్యాక్ రన్ అవుతూనే ఉంది. కోమాలోంచి బయటపడిన దీప అత్త, మామ, పిల్లల్ని వెతుకుంటూ హైదరాబాద్ బయలుదేరుతుంది. అదే సమయంలో సౌర్య, చంద్రమ్మ, గండ కూడా అక్కడికే బయలుదేరతారు. అనుకోకుండా ఇద్దరూ ఒకే బస్సులో ఉంటారు కానీ కలుసుకోరు. అప్పటికే సౌందర్య, ఆనందరావు, హిమ అమెరికా బయలుదేరతారు. బస్సు దిగి మొదట సౌర్య వాళ్లు వాళ్ల ఇంటికి వెళతారు. అక్కడ సౌందర్య వాళ్లు లేరని తెలుసుకుని బాధగా వెనుదిరుగుతారు. కొద్దిసేపటికి దీప అక్కడికి వెళ్లి వారు లేరని వెనుదిరుగుతుంది. అనంతరం ఆమెను కాపాడిని డాక్టర్ కార్తీక్ గురించి తెలిసిందని చెప్పడంతో తను కూడా ఆయన దగ్గరకి తిరిగి వెళుతుంది. ఉదయం గుడికి వెళ్లిన దీప భర్త అక్కడికి వచ్చినట్లు కలగంటుంది. ఆ తర్వాత ఆగస్టు 20 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సౌందర్య, ఆనందరావు, హిమ అమెరికాలో దిగి ఉన్నారు. దిగిదిగగానే మళ్లీ ఇండియా వెళ్లిపోదామని గొడవ చేస్తుంది హిమ. దాంతో.. ‘దిగి అర్ధగంట కాకుండానే వెళ్లిపోదామంటావేంటే.. ఎలాగైనా సౌర్యని తీసుకొస్తానని చెప్పాను కదా.. ఆ ఇల్లు అచ్చిరాలేదే’ అని బాధగా అంటుంది సౌందర్య. అది విని.. ‘అలా అయితే ఇల్లు మారాలి. కానీ దేశమే వదిలేయ్యాలా.. అమ్మానాన్న మనల్ని వదిలేయడానికి.. మనం సౌర్యని వదిలేయడానికి తేడా ఉండి నాన్నమ్మ. ఒకవేళ సౌర్య మనల్ని వెతుకుంటూ వస్తే ఎలా.. సౌర్యని అనాథని చేయొద్దు. అది అమ్మనాన్న కోరిక. సౌర్యని అనాథని చేయొద్దు’ అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది హిమ.
అనంతరం డాక్టర్ చెప్పిన అడ్రస్ పట్టుకుని కార్తీక్‌ని వెతుకుంటూ ఆసుపత్రికి వెళుతుంది దీప. అక్కడి రిసెప్షనిస్ట్‌ని.. ‘మేడం కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఇక్కడికి తెచ్చారంట.. ఆయన ఎక్కడా ఉన్నారు.. ఎలా ఉన్నారు?’ అని ఆత్రంగా అంటుంది దీప. ‘కారు యాక్సిడెంటా?’ అని అడుగుతుంది ఆ రిసెప్షనిస్ట్. ‘అవును.. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పండి..? తొందరగా చూడాలి..’ అంటుంది దీప కంగారుగా. ‘నిన్ననే వాళ్ల ఆవిడ వచ్చి తీసుకెళ్లిపోయారు’ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. అక్కడే ఉన్న ఓ కుర్చీలో కూర్చుని కార్తీక్ గురించే తలచుకుంటూ బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు తనకు ఇంత ద్రోహం చేస్తున్నావని దేవుడ్ని నిందిస్తూ ఉంటుంది. ఇంతలో ఓ నర్స్ పర్స్ తెచ్చి.. ‘ఇది ఆ వ్యక్తి మరిచిపోయి వెళ్లారు. వాళ్లు మీకు తెలుసు కదా.. మీరు ఇచ్చేస్తారా?’ అంటుంది. ఆ పర్సు తీసి చూసిన దీపకి కార్తీక్ ఫొటో కనిపిస్తుంది. దాంతో కార్తీక్ బతికి ఉన్నట్లు కన్‌ఫామ్ అవుతుంది.
అనంతరం.. డాక్టర్ బాబుకి పుట్టినరోజు కానుకగా ఆ పర్సు ఇవ్వడం గుర్తు చేసుకుంటుంది దీప. అప్పుడు ఆ పర్సు బహుమతి అందుకున్న కార్తీక్ ప్రాణాలు పోయేవరకూ తనతోనే ఉంటుందని మాటిస్తాడు. ఆ తర్వాత.. ఆ పర్సు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. అప్పుడు.. నర్సు ఆయన మీకేమవుతారని అడగగా.. భర్త అని చెబుతుంది దీప. దాంతో నర్సు కొంచె కన్‌ఫ్యూజన్‌తో ఆయన మీకు కూడా భర్తనా అని అంటుంది. దీప కోపంగా చూడడంతో.. అంతలోనే మీ వ్యక్తిగత విషయాలు నాకెందుకు ఆ పర్సు ఆయనకి ఇచ్చేయండని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప కూడా ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్లిపోతుంది.
మరోవైపు.. సౌర్యని దత్త తీసుకున్న చంద్రమ్మ, గండ పూజ చేస్తుంటారు. పూజ పూర్తికాగానే.. ఈ రోజు నుంచి వీరే నీ తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకో అని పూజారి చెప్పడంతో అలాగే చేస్తుంది సౌర్య. అనంతరం పాప పేరెంటని అడుగుతాడు పూజారి. సౌర్య తన పేరు చెప్పబోతుండగా.. ‘వద్దమ్మా.. నీ పేరేదైనా కానీ.. ఇక నుంచి నీపేరు జ్వాల’ అంటాడు గండ. అది తన చనిపోయిన కూతురి పేరని చెబుతుంది చంద్రమ్మ. అనంతరం పూజారి చెప్పడంతో సౌర్య చెవితో మూడుసార్లు జ్వాల అనే పేరును పలుకుతాడు గండ.
డాక్టర్ అన్నయ్య దగ్గరకి వెళ్లిన దీప జరిగిన విషయం చెబుతుంది. ‘నీ భర్తని తన భర్త అని ఎవరో తీసుకుని వెళ్లడం ఏంటమ్మా.?’ అంటాడు డాక్టర్. దానికి.. ‘అదే అన్నయ్యా నాకు అర్థం కావట్లేదు. అయితే.. మొదట ఎవరో తీసుకెళ్లారని తెలిసి నా భర్త కాదనుకుని నిరుత్సాహపడ్డా. కానీ పర్సు చూసిన తర్వాత ఆయనే అని తెలిసింది’ అని కొంచెం బాధ కొంచెం సంతోషం కలిసిన స్వరంతో దీప అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ తల్లి.. ‘అంటే మాత్రం నీ భర్త ఆవిడ భర్త అయిపోతాడు. అలాగని తీసుకెళ్లిన ఆవిడ చెప్పిందా.. నీ భర్త చెప్పాడా. ఆయన ఏమైనా చిన్న పిల్లోడా.. ఎవరితోనే వెళ్తిపోడానికి.. కాబట్టి కంగారు పడకుండా అన్న చెల్లెళ్లు కలిసి ఆయన్ని వెతకండి’ అని ధైర్యం చెబుతుంది. దాంతో మనసు కుదుటపడిన దీప అలాగేనమ్మా అంటుంది కొంచెం శాంతంగా.
తర్వాతి సీన్‌లో సౌందర్య, ఆనందరావు, హిమ ఇండియాలో వచ్చేసి ఉంటారు. దాంతో.. నాన్నమ్మకి, తాతయ్యకి థ్యాంక్స్ చెబుతుంది హిమ. సౌర్యని తీసుకొచ్చి చదివించి కలెక్టర్‌ని చేయాలని అంటుంది హిమ సంతోషంగా. అలాగే.. నేను వెతుకుతాను. నువ్వు చదువు మీద ధ్యాస పెట్టమని సౌందర్య, హిమతో చెబుతుంది. అనంతరం కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్లిన దీప భర్తని వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కాస్త దూరంలో ఓ కారు వేగంగా వచ్చి ఆగుతుంది. అందులోంచి కార్తీక్ చాలా స్తైల్‌గా కళ్లకి అద్దాలు పెట్టుకుని దిగుతాడు.
ఆ కారు డ్రైవర్ అవతల డోర్ తీసుకుని కార్తీక్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తాడు. ‘ఏంటి గణపతి ఇక్కడ ఆపావ్’ అంటాడు కార్తీక్. ‘సార్ నా పేరు గణపతి కాదు.. శివ’ అంటాడు ఆ వ్యక్తి. ‘ఏదొకటిలే.. ఎందుకు ఇక్కడ ఆపావ్’ అంటాడు కార్తిక్. ‘మేడమ్ ఫోన్ చేశారు సార్.. మీరు జ్యూస్ తాగే టైమ్ అయ్యిందని’ అంటాడు శివ. దాంతో.. ‘ఏదొకటిలే.. కత్తితో ప్రాణం తీయొచ్చు.. లేదంటే సూటిపోటి మాటలతో కూడా ప్రాణాలు తీయొచ్చు.. కానీ ప్రేమతో కూడా ప్రాణాలు తీయొచ్చని మీ మేడమ్‌ని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు జ్యూసులు తాగడం నా వల్ల కాదు కానీ.. తాగేశానని చెప్పెయ్’ అంటాడు కార్తీక్. కుదరదు సర్ అనడంతో జ్యూస్ తాగడానికి వెళతాడు.
అప్పుడు శివ కారు దగ్గరే తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీప. పర్సులో కార్తీక్ ఫొటోని చూపించి ఈయనని ఎక్కడైనా చూశారా అని అడగడంతో షాకై చూస్తుంటాడు డ్రైవర్. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. మార్కెట్‌లో దీప కూరగాయలు తీసుకుంటూ ఉండగా.. ఆమె వెనుకనే సౌర్య ఉంటుంది. ఆ వెనుకగా కార్తీక్, డ్రైవర్ శివతో పాటు ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి డాక్టర్ బాబు అంటూ వెళ్లి చేతిని గట్టిగా పట్టుకుంది దీప. నువ్వేరనీ అడుగుతాడు కార్తీక్. అంటే దీపని మర్చిపోయాడని అర్థం అవుతుంది. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.