వినాయక చవితి సందర్భంగా దీప ఇంట్లో పూజ చేస్తుంది. అదే సమయంలో మోనిత, డాక్టర్ బాబుతో కలిసి పూజ చేయాలనుకుంటుంది. అంతలోనే అక్కడికి దీప ఎంట్రీ ఇస్తుంది. గతం మరిచిపోయిన కార్తీక్‌తో తను ఇచ్చిన చీటీ గురించి చెబుతుంది. అందులో డాక్టర్ బాబు ఒక్కడే పూజ చేయాలని రాసి ఇస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం కార్తీక్ ఒంటరిగా పూజ చేస్తాడు. దాంతో మోనితకు దిమ్మ తిరిగిపోతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పూజ తర్వాత దీప వెళ్లిపోతుంది. ‘అసలు నువ్వెపుడు దానింటికి వెళ్లావ్ కార్తీక్’ అంటూ అరుస్తుంది మోనిత. ఆ రోజు రాత్రి జరిగిందంతా చెబుతాడు డాక్టర్ బాబు. అంతా విని షాకవుతుంది మోనిత. ఆ వంటలక్క లేకపోతే ఉండలేవా అంటూ కార్తీక్ చెడామడా వాయిస్తుంది. భార్యవి అంటే నువే కదా.. అసలు నువ్ ఎప్పుడూ ఎందుకు వంటలక్క మీద పడి ఏడుస్తావ్? అంటూ జవాబిస్తాడు డాక్టర్ బాబు. ఆపు కార్తీక్.. ఏదో చేస్తే చేసింది. అలాగని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటావా అంటూ మండిపడుతుంది మోనిత. స్టాప్ ఇట్ మోనిత అంటూ అదే రేంజ్‌లో వార్నింగ్ ఇస్తూ అరుస్తాడు కార్తీక్ కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్‌ని దీపకు వదిలిపెట్టనని మనసులో అనుకుంటుంది మోనిత.
ఆ తర్వాత సీన్‌లో సౌందర్య ఇంట్లో వినాయకుడి పూజ జరుగుతుంది. హిమ సౌర్యని తలుచుకుంటూ బాధపడుతుంది. అమ్మా, నాన్నల ఆఖరి కోరిక ప్రకారం సౌర్యని బాగా చదివించాలి కద నానమ్మ. నేను రోజూ స్కూల్‌కి వెళ్తున్నా కానీ సౌర్య వెళ్లడం లేదు. మనం ఇక్కడ సంతోషంగా పూజ చేసుకుంటున్నాం. అక్కడ సౌర్య ఎలా ఉందో ఏంటో అని తన బాధను నానమ్మకు చెబుతుంది హిమ. ‘పోయిన సంతోషం తిరిగి రావాలని కోరుకుంటూ పూజ చేస్తున్నామే’ అంటూ బదులిస్తుంది సౌందర్య. సౌర్యని ఎలాగైనా తీసుకురా నానమ్మా అని బతిలాడుతుంది హిమ. ఎన్నిసార్లు చెప్పినా అది రావట్లేదు. అది మనతో ఉండకపోయినా తెలిసిన చోటున్నా బాగుంటుంది కదా అంటుంది సౌందర్య. తనకు నీ మీద కోపం పోయేంత వరకు ఇది తప్పదని చెబుతుంది హిమతో. అమ్మనాన్నలు కనిపించాకే వస్తానంటుంది కద నానమ్మ. మరి వాళ్తు వస్తారా? అని ప్రశ్నిస్తుంది హిమ. ‘వాళ్లు లేరనేది మనం నమ్మాం కానీ సౌర్య నమ్మడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా అమ్మా నాన్నలు ఉన్నారనుకుంటుంది. ప్రతిదానికి కాలమే సమాధానం చెబుతుంది’ అంటూ హిమని ఓదారుస్తుంది సౌందర్య.
సీన్ కట్ చేస్తే.. దీప అన్నయ్యా అంటూ కాఫీ ఇస్తుంది. మోనిత కార్తీక్‌తో కలిసి పూజ చేయకుండా ఆపినందుకు సంతోషమే కదమ్మా.. అంటాడు అతను. ‘సంతోషమో, బాధో తెలియట్లేదు అన్నయ్య. నా భర్తా, పిల్లలతో కలిసి పూజ చేసుకోనందుకు బాధపడాలో లేక మోనితని ఆపినందుకు సంతోషపడాలో తెలియట్లేదు’ అంటూ బాధగా చెబుతుంది దీప. డాక్టర్ బాబు నీ మాట విన్నందుకు సంతోషమే కదమ్మా.. అంటాడు దీపతో. సంతోషమే కానీ ఈ సంతోషం శాశ్వతం అయ్యేది ఎప్పుడో? అని ఆలోచిస్తుంది దీప. ఇంతవరకు నాకు అనుమానమే ఉండేది కానీ ఇప్పుడు డాక్టర్ బాబు నీ మాట విన్నాక నాకు నమ్మకం కలిగింది అంటూ దీపకు ధైర్యం కలిగేలా హితబోధ చేస్తాడు అతడు. సమయం వచ్చినప్పుడల్లా కార్తీక్‌కు గతం గుర్తు చేయమని సలహా ఇస్తాడు దీపకు అన్నయ్య. డాక్టర్ బాబుని పరిచయం చేయమని అడగ్గా.. ఈ రోజు చేస్తానని మాటిస్తుంది దీప. మోనితని కూడా అడగ్గా..ఈ రోజు దాని ముఖం చూసిన పాపమే అంటుంది మళ్లీ.
మరోవైపు మోనిత కార్తీక్‌ని ఎలా తన దారికి తెచ్చుకోవాలా అని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ప్రేమ లేకపోవడం వల్లే కార్తీక్ తనకు దగ్గరవడం లేదని, దగ్గరయ్యే ప్లాన్ చేస్తుంది మోనిత. కార్తీక్ వచ్చే టైంకు ఆరోగ్యం బాగలేనట్లు నటిస్తూ పడుకుంటుంది. కార్తీక్ వచ్చి ఏమైంది మోనిత అని అడగ్గా.. బాగా నీరసంగా ఉంది. జ్వరం వచ్చేలా ఉందంటూ నమ్మిస్తుంది మోనిత. డాక్టర్‌ని పిలుస్తా అంటూ వెళ్తాడు కార్తీక్. ఆగు అంటూ చేయి పట్టుకుంటుంది మోనిత. ‘నువ్ నా బాధను అర్థం చేసుకోవడం లేదు కార్తీక్. కన్న బిడ్డ కనిపించకుండా పోయాడు. నువ్ నాలో ఆవేశాన్నే చూస్తున్నావ్. నన్ను నువ్ ప్రేమగా చూసుకోవట్లేదు’ అంటూ మొసలి కన్నీరు పెడుతుంది. దానికి కరిగిపోయిన కార్తీక్.. బంగారం అంటూ మోనితను ఓదారుస్తాడు. డాక్టర్ కోసం బయటికి వెళ్తాడు.
ఆ తర్వాత దీప తన అన్నయ్యతో కలిసి కార్తీక్ ఇంటికి వస్తారు. అంతలోనే కార్తీక్ శివని వెతుకుతూ కనిపిస్తాడు. వంటలక్క కనిపించడంతో మోనితకు జ్వరం వచ్చిందని, డాక్టర్ కోసం వెళ్తున్నట్లు చెప్తాడు. ఈయన మా అన్నయ్య అంటూ పరిచయం చేస్తుంది దీప కార్తీక్‌కు. ఇతను కూడా డాక్టరేనని మోనిత ఇంటికి పంపిస్తుంది అతన్ని. జ్వరం ఉన్నట్లు నటిస్తున్న మోనిత కంగారుపడుతుంది ఇంట్లో. శివకు ఫోన్ చేసి అడుగుతుంది. కొంప తీసి డాక్టర్ కోసం వెళ్లాడా అనుకుంటుంది మోనిత. అంతలోనే కార్తీక్ డాక్టర్‌ని తీసుకుని మోనిత దగ్గరకు వెళ్తాడు. మోనితని టెస్ట్ చేసిన డాక్టర్ ఏం లేదు అంతా నార్మల్ అని చెప్తాడు. కానీ మోనిత మాత్రం డాక్టర్ చొక్కా పట్టుకుని దీప పంపిందా? అంటూ నిలదీస్తుంది. మరి డాక్టర్ బాబు ఏమంటాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..