దీపని ఎప్పుడు కలవనని, తనతో ఎప్పుడూ మాట్లాడనని ప్రమాణం చేయమని కార్తీక్‌ని బలవంతం చేస్తుంది. ఇంతలో దీప వచ్చి తనేం తప్పు చేయలేదని దేవుడి మీద ప్రమాణం చేస్తుంది. అంతేకాకుండా.. మోనితని కూడా ప్రమాణం చేయమంటే లేదంటూ తప్పించుకుంటుంది. అంతేకాకుండా.. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు చెబుతూ ఉండడంతో కోపంతో మోనితని అక్కడే వదిలేసి కారులో వెళ్లిపోతాడు కార్తీక్. అయితే.. మధ్యలో అడ్రస్ మర్చిపోవడంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటుంది. అనంతరం ఆటోలో ఇంటికి వెళుతుంది మోనిత. అక్కడ కార్తీక్ తలకి మర్దన చేస్తూ కనిపిస్తుంది. దాంతో రెచ్చిపోయిన మోనిత.. దీపని తిట్టేస్తుంది. దాంతో.. జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 9 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దీపనే తనని ఇంటికి తీసుకొచ్చిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు కార్తీక్. కానీ గుర్తు రాదు.. దాంతో మీరు కచ్చితంగా గుర్తు తెచ్చుకోగలుగుతారు అంటూ ప్రోత్సహిస్తుంటుంది దీప. దీంతో అసలు విషయం కార్తీక్ జరిగిన సంగతంతా గుర్తొస్తుంది. అడ్రస్ మరిచిపోయిన కార్తీక్ అందరినీ ఇంటి అడ్రస్ అడుగుతుంటాడు. ఇంతలో అక్కడికి దీప వస్తుంది. దాంతో తనని ఇంటికి తీసుకెళ్లమని రిక్వెస్టు చేస్తాడు కార్తీక్. సరేనని అతని కారులో ఎక్కి దీప దారి చెబుతుంటే కార్తీక్ డ్రైవ్ చేస్తుంటాడు. అయితే.. కారులో వెళుతున్న దీప తమకి జరిగిన యాక్సిడెంట్ గురించే ఆలోచిస్తూ.. దేవుడిని మంచి జరిగేలా చేయమని వేడుకుంటుంది.
అది జరిగింది మోనిత అని చెప్పి.. కరెక్టుగా చెప్పానా అని దీప వైపు తిరిగి అంటాడు. దాంతో.. ఇలాగే ఉంటే అన్ని గుర్తు చేసే అవకాశం ఉందని.. గుర్తు చేసిందని చాలు వెళ్లు అని దీపని కసురుతుంది మోనిత. దాంతో.. ‘ఎందుకు అలా కసురుతున్నావు.. వంటలక్క రాకపోతే నేను ఇంటికి రాలేకపోయేవాడిని. అప్పుడు వెతుక్కుంటూ రోడ్డు మీద పడేదానివి. పోలీసు కంప్లైంట్ ఇచ్చిన దొరికేవాడిననే నమ్మకం లేదు. కాబట్టి దీపకి స్వారీ చెప్పు’ అని మోనితకి ఆర్ఢర్ వేస్తాడు కార్తీక్. దాంతో చిర్రెత్తుకు వచ్చిన మోనిత దీపని మాటలతో ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అవుతుంది. అందుకే.. ‘స్వారీ వంటలక్క. మా ఆయనని తెచ్చి అప్పగించినందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రతి మాటకి ముందు ఓసారి వెనుక ఓసారి మా ఆయన అంటుంది మోనిత. అంతటితో ఆగకుండా దీపని కౌగిలించుకుని ఎక్కడ దొరికిన మా ఆయన్ని నాకే అప్పగించాలని వెటకారంగా అంటుంది. అది విని.. ‘ఇంతకుముందు కూడా ఇలాగే డాక్టర్ బాబుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నావు. తర్వాత ఆయనే తన్ని తరిమేసేలా చేశాను’ అని అదేస్థాయిలో రిటార్డ్ ఇస్తుంది దీప. అనంతరం ఇంటికి వెళ్లిపోతూ.. రేపు వినాయక చవితి పూజ చేస్తున్న తప్పకుండా రావాలని కార్తీక్‌ని ఆహ్వానిస్తుంది దీప. దాంతో కార్తీక్ సంతోషంగా సరేనంటాడు.
మరోవైపు.. వినాయకచవితి సందర్భంగా మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తుంది సౌర్య. అనంతరం అక్కడికి వచ్చిన ఇంద్రుడు, చంద్రమ్మతో.. వారణాసితో కలిసి ఈ విగ్రహాలను అమ్ముకొస్తానని చెబుతుంది. దాంతో.. నీకెందుకమ్మా ఈ పనులన్నీ మేం ఉన్నాం కదా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ దేవుడి మహిమ వల్లనైనా అమ్మనాన్న కలిసే అవకాశం ఉందేమోనని ఆశతో వెళుతున్నానని సౌర్య చెప్పడంతో వారిద్దరు ఒకే అంటారు. అనంతరం వారణాసితో కలిసి బయటికి వెళుతుంది సౌర్.
ఇంకోవైపు.. ఇంట్లో కూర్చొని దీప గురించే ఆలోచిస్తుంటుంది మోనిత. ‘కార్తీక్‌కి గతం గుర్తు లేదు కదా. మరి దీపతో తల ఎందుకు పట్టించుకున్నాడు. ఒక్కోసారి నాతో కంటే దీపతోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటున్నాడెమో’ అని అనిపిస్తుందని అనుకుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్‌తో వంటలక్క పిలిచింది కదా, నువ్వు పూజకి వెళ్లొద్దని గట్టిగా చెబుతుంది. దాంతో.. అయితే వంటలక్కనే మన ఇంటికి రమ్మని పిలవమని అంటాడు కార్తీక్. దాంతో ఏం చేయలేక ఒకే అంటుంది మోనిత. అనంతరం దీపని తిట్టుకుంటుంది.
అనంతరం.. డాక్టర్ అన్నయ్య ఇంటికి వెళుతుంది దీప. జరిగిన విషయాన్ని అంత పెద్దావిడకి చెబుతుంది. దాంతో.. డాక్టర్ బాబుని నీ ఇంటికి తీసుకెళితే.. రెండు రోజుల్లో మోనితని మర్చిపోయి ఉంటేవాడు కదా అని నిరాశగా దీపతో అంటుంది పెద్దావిడ. ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్.. ‘దీప సరిగ్గా చేసింది. ఒకవేళ కార్తీక్‌కి మోనిత భార్యగా గుర్తుండిపోయి.. దీప ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు కార్తీక్ అనుకున్నాడనుకో చాలా సమస్య అవుతుంది’ అని అంటాడు. అది విని అందుకే అక్కడికే తీసుకెళ్లాను అన్నయ్యా అంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభంకార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. మోనిత వెళ్లి పూజ కోసం ఇంటికి రమ్మని దీపని వెటకారంగా పిలుస్తుంది మోనిత. అనంతరం మోనిత, కార్తీక్ కారులో వెళుతుండగా.. విగ్రహాలు అమ్ముతున్న సౌర్య కనిపిస్తుంది. దాంతో.. గుర్తు పట్టేశాడా అని షాక్ అవుతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.