గత ఎపిసోడ్‌లో.. ఇంటికి రమ్మని హిమ ఎంతసేపు బ్రతిమిలాడిన సౌర్య ఒప్పుకోదు. పైగా సౌందర్యని చూసి వెళ్లి తెలియకుండానే మోనిత కారు డిక్కీలో దాక్కుంటుంది. ఇంకోవైపు కాలనీ వాసులు నాటకం వేస్తుంటే తన గతాన్నే కథగా చెప్పి నాటకం వేయమంటుంది దీప. అందులో ప్రధానపాత్రలో దీపనే నటించమని అడుగుతారు కాలనీవాసులు. సరేనని చెప్పి కార్తీక్‌ని నాటకం వేసే కమ్యూనిటీ హాలుకి తీసుకొస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కారు దిగిన మోనిత డిక్కీలో సౌర్య ఉండడం చూసి షాక్ అవుతుంది. తన కారు అని తెలియక ఎక్కిందా. లేక తనని ఫాలో చేస్తుందా అని మనసులో అనుకుంటుంది. అది బయటికి తెలియకుండా.. ‘సౌర్య నువ్వు ఇలా కారు డిక్కీలో ఉన్నావు ఏంటమ్మా’ అని అడుగుతుంది. ‘మీ కారని తెలియక డిక్కీలో ఉన్నాను. తెలిస్తే సీటులోనే కూర్చునేదాన్ని ఆంటీ’ అంటుంది సౌర్య. అంతేకాకుండా ఇక్కడ ఉన్నారు ఏంటి ఆంటీ అని మోనిత అడుగుతుంది సౌర్య. ఈ చోటు వదిలి వేరేచోట ఉండలేక బట్టల దుకాణం పెట్టుకొని ఉంటున్నాను అని కవర్ చేస్తుంది మోనిత. సౌర్య అక్కడ ఎందుకుందని మోనిత అడిగితే.. దానికి సౌర్య ‘నాకెందుకో అమ్మానాన్న బతికే ఉన్నారు అనిపిస్తుంది. అందుకే వాళ్ల కోసం వెతుకుతూ ఇక్కడే తిరుగుతున్నాను’ అని చెప్తుంది. మోనిత ‘వామ్మో ఇది దీప కంటపడిన, దీనికంట కార్తీక్ పడిన ప్రమాదమే’ అని మనసులో అనుకుని.. ఎలాగైనా సౌర్యని అక్కడి నుంచి పంపించాలని అనుకుంటుంది. అందుకే ‘సౌర్య నేను నీలాగే అనుకున్నాను. కానీ నేనే నా చేతులతో దీప కార్తీక్ పోస్ట్‌మార్టం చేపించి దహనం చేశాను. నీ బాధ చూడలేక బ్రతికే ఉన్నారని అబద్దం చెప్పడం కన్నా నిజం చెప్పడం మంచిది అని చెబుతున్నా. నువ్వు మీ నానమ్మ దగ్గరకు వెళ్లు’ అని బ్రతిమిలాడుతుంది. దాంతో సౌర్య అక్కడే ఉన్న తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తానని అంటుంది. సౌర్యని తీసుకెళుతుంది మోనిత.
మరోవైపు సౌందర్య, హిమను తీసుకెళ్తూ.. అసలు అన్నమే తినటం లేదని ఆనందరావుకు చెప్పి, ఒక మంచి హోటల్ దగ్గర ఆపుతా అని చెప్తుంది. దీంతో ఆనందరావు హిమతో సౌర్య దగ్గరకి వెళ్లడం వలన ఏమీ అర్థం అయింది అని అడుగుతాడు. సౌర్య ఇక ఎప్పటికీ ఇంటికి రాదని అర్థమైంది అంటుంది హిమ. అప్పుడు సౌర్యని మేము ఎలాగైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని, నువ్వు ఇక నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని హిమకి చెబుతుంది సౌందర్య. హిమ కూడా సరే అంటుంది.
ఇంకోవైపు నాటకం దగ్గర కార్తీక్ వెనుక కూర్చున్న ఆడవారు నాటకం గురించి మాట్లాడుకుండూ.. ‘కార్తీకదీపం నాటకం అంటే భర్త కార్తీక్ భార్య దీప అనుకుంటా. వీరి ఇద్దరి మధ్యలో నిజంగా జరిగిన సన్నివేశాలని నాటకంగా చూపిస్తున్నారేమో’ అని అనుకుంటూ ఉంటారు. అది విన్న కార్తీక్, దీపని పిలిచి ఏంటి ఇలా నా పేరుతో నాటకం వేసి నన్నే నీ భర్తగా అందరికీ చెబుదామని చూస్తున్నావా అంటూ కోప్పడతాడు. అక్కడే ఉన్న డాక్టర్ అన్నయ్య.. ‘లేదు కార్తీక్. దీప భర్త పేరు కూడా కార్తీక్‌యే. అందుకే ఆ పేరు పెట్టారు. మీరు కొంచెం ఓపిగ్గా నాటకం చూడండి’ అని బ్రతిమలాడుతాడు.
అనంతరం నాటకం మొదలుపెడతారు. టైటిల్ సాంగ్ తర్వాత కార్తీక్‌తో దీప పరిచయం. దీప నాన్నతో కార్తీక్, దీపని పెళ్లి చేసుకుంటానని చెప్పే సంఘటన తర్వాత గుళ్లో పెళ్లి జరగడం సౌందర్య కోపగించుకోవడం, తర్వాత కార్తీక్ దీపని హనీమూన్‌కి తీసుకెళ్లడం, అక్కడ దీపకి విహారి కవిగా కలవడం, అతనితో దీప పరిచయం, దానిని మోనిత వేరే కోణంలో కార్తీక్‌కి చూపించడం, కార్తీక్ పిల్లలు పుట్టే అవకాశం లేదని దీప కడుపులో ఉన్న బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని దీపని అవమానించి ఇంటి నుంచి వెళ్లగొట్టడం లాంటి అన్ని సంఘటనలు వేస్తారు. ఇవన్నీ చూసిన కార్తిక్ కి గతం లీలగా గుర్తుకు వస్తూ ఉంటుంది. దాంతో ఈ ఎపిసోడ్ వరకూ శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చిన కార్తీక్ దీప అంటూ వెళ్లి స్పృహ తప్పి పడిపోగా.. డాక్టర్ అన్నయ్య ఆసుపత్రిలో చేరుస్తాడు. అక్కడకు మోనిత కూడా వస్తుంది. కార్తీక్ ని నేను గుర్తొచ్చానా డాక్టర్ బాబు అని దీప అడగగా.. దీప అంటూ కళ్లు మూసుకుంటాడు కార్తీక్. కార్తీక్ గతం గుర్తొచ్చిందో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.