దీప కావాలనే నాటకాలాడుతుందని ఉన్నవి లేనివి ఎక్కించి కార్తీక్ కి చెప్తుంది మోనిత. దాంతో కోపంగా దీప దగ్గరికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకుంటాడు కార్తీక్. భర్త ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో చాలా బాధ పడిపోతుంది దీప. అందుకే వెంటనే డాక్టర్ అన్నయ్య దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతుంది. అది విని ఆమె ఏం చేయాలో సలహాలు ఇస్తాడు. అనంతరం ఓ ఇద్దరూ మహిళలు వెళ్లి తమ ప్రకృతి వైద్యశాలలో కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా చేసే మందు ఉందని చెబుతారు. అది విని వారి మీద కోపంతో అరుస్తుంది మోనిత. ఆ తర్వాత సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
‘మీ మందు వాడితే వారం రోజుల్లో గతం గుర్తొస్తుందా.. ఇలాంటి కబుర్లు చెప్పి డబ్బు గుంజే వాళ్లని చాలామందిని చూశాను’ వెళ్లమని చెబుతుంది మోనిత. దాంతో ఫ్రీగా వైద్యం చేస్తామని ఆ మహిళలు ఇద్దరు చెబుతారు. అయినా తన భర్తకి గతంగుర్తు రావాల్సిన అవసరం లేదని కరాకండిగా చెప్పి పంపించేస్తుంది మోనిత. ఇదంతా బయట ఉండి వింటుంది దీప. వెళ్లిపోతున్న ఆ మహిళలను అడిగి తన భర్త కోసం తను మందు తీసుకుంటానని చెబుతుంది. రెండు రోజుల సమయం పడుతుందని ఆ మహిళలు చెప్పడంతో ఫోన్ నెంబర్ తీసుకుంటుంది దీప.
అనంతరం పరిగెత్తుకుంటూ డాక్టర్ అన్నయ్య దగ్గరికి వెళుతుంది దీప. జరిగిన విషయాన్ని అంతా ఆయనకి పూసగుచ్చినట్లు చెబుతుంది. అంతే కాకుండా ఫోన్ కలిపి అతనికి ఇచ్చి మాట్లాడమంటుంది. అతను డీటెయిల్స్ అని కనుక్కొని నిజమే కావచ్చని వెళ్లమని చెప్తాడు. దాంతో దీప భర్తకు గతం గుర్తొస్తుంది అన్న ఆనందంతో వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వెళుతూ వెళుతూ మోనిత ఇంటి మీద ఓ కన్నేసి ఉంచమని డాక్టర్ అన్నయ్యకు చెబుతుంది. ఆయన బావగారు బాధ్యత తనదని చెప్పడంతో సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది.
అక్కడ కార్తీక్ నొప్పి వల్ల తల పట్టుకొని కూర్చుంటాడు. అది చూసి.. గతం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని ముసలి కన్నీళ్లు కారుస్తుంది మోనిత. దాంతో అతను అలాంటి ప్రయత్నం చేయట్లేదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అలాగే చెన్నై వెళ్లి కొడుకు ఆనంద్ ని ఎప్పుడు తీసుకొస్తామని అడుగుతాడు. దాంతో శివని తన దగ్గర ఉంచి వెళ్లి వెంటనే తీసుకొస్తానని చెప్తుంది మోనిత. ఇంతలో అక్కడ దీప గతం గుర్తొచ్చే మందులు తీసుకురావడానికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెళ్లిన మోనిత తను వేసిన ఉచ్చులో వంటలక్క ఈజీగా పడిపోయిందని సంతోషపడుతుంది. అనంతరం దీప దగ్గరికి వెళ్లి కార్తీక్ దక్కడని వెళ్లిపోతున్నావా దీపక్క అని వెటకారంగా అంటుంది మోనిత. దానికి వారం రోజుల్లో కార్తీక్‌కి గతం గుర్తొస్తుందని అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఊహించుకోమని అదే స్థాయిలో రిప్లై ఇస్తుంది దీప. డాక్టర్ బాబుకి గతం గుర్తు వచ్చిన తర్వాత ఇంతకుముందు మోనితకి జరిగిందే మళ్లీ జరుగుతుందని అంటుంది దీప. దాంతో వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోమని అంటుంది మోనిత. అనంతరం దీప అక్కడి నుంచి బయలుదేరుతుంది.
అక్కడి నుంచి బయలుదేరిన దీప ఇంద్రుడు ఆటో దగ్గరకు వెళుతుంది. ఆ ఆటో మీద ‘అమ్మానాన్న ఎక్కడున్నారు’ అని రాసి ఉండడం చూసి.. గతంలో ‘అమ్మ త్వరగా రా’ అని తన ఆటో మీద సౌర్య రాయడం గుర్తుతెచ్చుకొని దీప ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇంద్రుడి దగ్గరకు వెళ్లి బస్టాండ్ కి తీసుకెళ్లమని చెబుతుంది. ఓకే అని బయలుదేరుతుండగా ఇంద్రుడికి సౌర్య ఫోన్ చేస్తుంది. ఇంటికి కావాల్సిన సరుకుల లిస్టు చెబుతుంటుంది సౌర్య. బస్సు కు టైం అవుతుండడంతో లిస్టు తాను రాస్తానని ఫోన్ తీసుకొని.. ఇంద్రుడిని ఆటో నడపమంటుంది దీప. దీంతో ఫోన్లో మాట్లాడుతున్న దీప గొంతును సౌర్య గుర్తుపట్టేస్తుంది. కానీ శబ్దాలు ఎక్కువ రావడంతో కన్ఫామ్ చేసుకోలేకపోతుంది. అలాగే సౌర్యకి జలుబు చేయడం వల్ల గొంతు మారిపోతుంది. దానివల్ల సౌర్య గొంతుని దీప గుర్తుపట్టదు. అనంతరం ఫోన్ పెట్టేసి ఆటో దిగి వెళ్లిపోతుంటుంది దీప. ఇంతలో ఎక్కడికి వెళుతున్నారని దీపని ఇంద్రుడు అడుగుతాడు. దాంతో జరిగిన విషయాన్ని చెబుతుంది దీప. అది విని అక్కడ అలాంటిదే ఏ హాస్పిటల్ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంద్రుడు. ఇంద్రుడు మాటల వల్ల మోనిత చేసిన మోసం దీపకి అర్థమవుతుంది.
ఫోన్ పెట్టేసిన తర్వాత అవతల మాట్లాడింది దీపే అని అనుకుంటుంది సౌర్య. దాంతో వెంటనే బాబాయ్ కి ఫోన్ చేసి ఆమె ఫోటో పంపించమని అడుగుతుంది. కానీ ఆమెను ఇంతకుముందే బస్టాండ్లో దింపేసి వచ్చానని చెబుతాడు ఇంద్రుడు. అమ్మ అనే డౌట్ ఉందని చెబుతుంది సౌర్య. దాంతో నువ్వు తల్లిదండ్రులను వెతికినట్టు.. ఆమె పిల్లల్ని వెతకడం లేదని అందుకే ఆ అవకాశం లేదని చెబుతాడు ఇంద్రుడు. కానీ మరోసారి ఆమె కనిపిస్తే ఫోటో తీసి పెడతానని అంటాడు. మరోవైపు మోనిత మోసం తెలిసిన దీప పరిగెత్తుకుంటూ డాక్టర్ అన్న దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.