సంజీవని ప్రకృతి వైద్యశాల నుంచి ఇద్దరు మహిళలు వచ్చి కార్తీక్‌కి గతం గుర్తొచ్చేందుకు మందు ఇస్తామని అంటారు. అది ఇష్టం లేని మోనిత వారిని తిట్టి పంపించేస్తుంది. ఇదంతా బయట నిలుచున్న దీప వింటుంది. తన భర్త కోసం ఆ మందు తీసుకుంటానని అంటుంది. డాక్టర్ అన్నయ్యకు చెప్తే ఆయన కూడా ఓకే అంటాడు. అనంతరం అక్కడ నుంచి సౌర్యను దత్తత తీసుకున్న ఇంద్రుడు నడిపే ఆటో ఎక్కుతుంది. ఆటో దిగేముందు ఎక్కడికి వెళ్తున్నారని దీపని ఇంద్రుడు అడుగుతాడు. దాంతో జరిగిన విషయం అంతా అతనికి చెబుతుంది. అది విని అలాంటి హాస్పిటల్ ఏది ఆ ప్రాంతంలో లేదని చెబుతాడు ఇంద్రుడు. అప్పుడు మోనిత చేసిన మోసం దీపకి అర్థమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
మోనిత చేసిన మోసం గురించి తెలిసి పరిగెత్తుకుంటూ డాక్టర్ అన్నయ్య దగ్గరికి వెళుతుంది దీప. అది చూసి హాస్పిటల్ కి వెళ్లాల్సిన దీప ఇక్కడికి వస్తుందేంటి అని అతను షాక్ అవుతాడు. దాంతో ఇంద్రుడు చెప్పిన విషయాన్ని చెబుతుంది దీప. డాక్టర్‌కి డౌట్ రాకుండా సంజీవని చికిత్సాలయం అని చెప్పి.. తనకు మాత్రం వేరే అడ్రస్ పంపించారని చెబుతుంది దీప. దాంతో డాక్టర్ బాబుని ఎక్కడికో తీసుకెళ్లాలని మోనిత ప్లాన్ వేసి ఉంటుందని అనుకుంటారు. అయితే ఇప్పటికిప్పుడు వేరే చోటికి వెళ్లడానికి కార్తీక్ ఒప్పుకొనే అవకాశం లేదని.. మోనిత వేరే పథకం ఏదో వేసిందని అనుమానపడతారు. అందుకే త్వరగా అక్కడికి వెళ్లి ఆ ఇంటి మీద ఒకన్నేసి ఉంచమని దీపకి చెబుతుంది డాక్టర్ తల్లి. దాంతో దీప అక్కడ నుంచి బయలుదేరుతుంది.
ఒకవైపు చెన్నై వెళ్లడానికి మోనిత రెడీ అవుతుంది. డ్రైవర్ శివని పిలిచి ఊరు వెళ్తున్నానని చెప్పి వచ్చేవరకు కార్తీక్‌ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. దాంతో ఒక్క క్షణం కూడా సార్‌ని వదలను మీరు ఒక రోజు మొత్తం ఆయన వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు శివ. అది విని మోనిత చాలా కూల్ గా ఇలాంటి ప్రశ్నలు వేస్తే జాబ్‌లో నుంచి తీసేస్తానని బెదిరిస్తుంది. దాంతో క్షమించండి మేడం అని కాళ్లు పట్టుకున్నంత పని చేస్తాడు శివ. శివని జాగ్రత్తగా ఉండమని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.
ఇంకోవైపు సౌర్య చెప్పిన సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు ఇంద్రుడు. సరుకులు అన్ని వచ్చాయో లేదో అని చెక్ చేస్తూ ఉంటుంది చంద్రమ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన సౌర్యకి పక్కింటి కి బంధువులు రావడంతో వాళ్లకోసం వంటలు చేస్తున్నానని చెబుతుంది చంద్రమ్మ. డబ్బు మాత్రం డిమాండ్ చేయకుండా వాళ్లు ఇచ్చినంతా తీసుకోవడమే అని చెబుతుంది. అది విని అమ్మ దీప కూడా అలాగే చేసేదని ఎమోషన్ అవుతుంది సౌర్య. అది విని మంచోలనే దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతాడని నోరు జారి అంటుంది చంద్రమ్మ. దాంతో అలా మాట్లాడొద్దని కోపంగా అరుస్తుంది సౌర్య. అనంతరం చంద్రమ్మ చేతిలోని లిస్ట్ చూసి వంటలక్క చేతిరాతను గుర్తుపట్టేస్తుంది సౌర్య. పొద్దున ఫోన్లో అదే గొంతు ఆవిడ చేతిరాత కూడా దీపలాగే ఉండడంతో.. ఆమె తన అమ్మ కావచ్చని అంటుంది సౌర్య. అంతేకాకుండా ఇంకోసారి అమ్మలేదని అనొద్దని ఇంద్రుడు, చంద్రమ్మకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌర్య.
మరోవైపు ఆనందరావు, సౌందర్య, హిమ కలిసి ఆనంద్‌ని తీసుకురావడానికి కారులో వెళుతుంటారు. ఆనంద్‌ని తాత, నానమ్మ దగ్గర వదలకుండా లక్ష్మణ్ ఇంట్లో వదలటం ఏంటని అనుమానపడతాడు ఆనందరావు. అలా చేస్తే మోనిత ఎందుకు అవుతుందని అంటుంది సౌందర్య. కానీ మోనిత ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా ఉందని సౌందర్య అంటుంది. ఇంతలో ఆనంద్‌ని ఇవ్వడానికి లక్ష్మణ్ ఒప్పుకోలేదు కదా అని అడుగుతుంది హిమ. తమ మనవడిని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తామని అంటుంది సౌందర్య.
ఇంతలో మోనిత వెళ్లి తన కొడుకు ఆనంద్‌ని తీసుకుంటుంది. అది చూసి లక్ష్మణ్, అతని భార్య చాలా బాధపడతారు. బాబు మీద ప్రేమని చంపుకోలేమని ఎమోషనల్ అవుతారు. అయితే ఇప్పుడు బాబుని తీసుకెళ్లిన మళ్లీ తీసుకొచ్చి వారికే అప్పగించే అవకాశం ఉందని చెబుతుంది మోనిత. కానీ ఆస్తిని మాత్రం వారి దగ్గరే ఉంచుకోమని చెప్పి కారులో వెళ్లిపోతుంది. మోనిత అటు వెళ్లిన మరుక్షణంలో అక్కడికి సౌందర్య, ఆనందరావు వస్తారు. తమ మనవడు ఏడని లక్ష్మణ్‌ని అడుగుతారు. ఇంతకుముందే మోనిత వచ్చి తీసుకెళ్లినట్లు వారు చెబుతారు. దాంతో మోనిత ఏం చేస్తుందని అనుకుంటూ.. సొంత తల్లే బాబుని తీసుకెళ్లడంతో ఏం చేయలేక అక్కడ నుంచి వెనుదిరుగుతారు.
మరోవైపు ఇంట్లో ఉన్న కార్తీక్ సంతోషంగా ‘ఎన్నెన్నో జన్మల బంధం’ అని పాటలు పాడుకుంటూ ఉంటాడు. అది విని మేడం ఊరెళ్లిందని సంతోషంగా ఉన్నారా సర్ అని అడుగుతాడు శివ. దాంతో ఏం మాట్లాడుతున్నావ్ అంటూ లాగి ఒకటి పీకుతాడు కార్తీక్. ఇంతకుముందు మేడమ్‌ని తిట్టిన సర్ ఇలా ఎందుకు కొట్టాడా అని అనుమానపడతాడు శివ. చెంప మీద చేయి పెట్టుకొని బయటికి వెళ్లిన శివకి దీప ఎదురొస్తుంది. ఇంట్లో వాళ్ల కోసం వచ్చానని అడిగితే ఎవరు లేరని చెబుతాడు శివ. కానీ పాటలు పాడుతున్న కార్తీక్, దీప కంట పడతాడు. దాంతో శివని మాటల్లో పెట్టి మోనిత చెన్నై వెళ్లిందని.. మరుసటి రోజు ఉదయం వరకు రాదని తెలుసుకుంటుంది దీప. అందుకే మోనిత వచ్చేలోపు కార్తీక్‌ని దారిలో పెట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.