గత ఎపిసోడ్‌లో.. దుర్గని, దీపని చంపడానికి టిఫిన్‌లో విషం కలుపుతుంది వాణి. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి తనకు పెట్టమంటాడు. దాంతో.. కంగారు పడిన వాణి వెంటనే మోనితకి మేస్సేజ్ చేస్తుంది. మోనిత వచ్చి టిఫిన్ మొత్తాన్ని కావాలనే కిందపడేసి గోల చేసి కార్తీక్‌ని తీసుకెళ్లిపోతుంది. అనంతరం మోనితని ఎలాగైనా వదిలించుకోవాలని కార్తీక్ ఫిక్స్ అవుతాడు. అందుకే కావాలనే రకరకాలుగా తమ రిలేషన్ గురించి అడిగి మోనితని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అయినా చాలా తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటుంది మోనిత. తరువాత సౌర్యని వెతుకుతూ ఊర్లోకి వెళతాడు కార్తీక్. ఆ తర్వాత అక్టోబర్ 27న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్.. సౌర్యని వెతుకుతూ మార్కెట్ వైపు వస్తాడు. అక్కడే చాలా మందిని అడుగుతాడు. ‘ప్రతిరోజు కాకుండా.. అప్పుడప్పుడు పండగలకు మాత్రమే సరుకులు తెచ్చి అమ్మేవాళ్లు ఎప్పుడొస్తారో?’ అని ఆరా తీస్తాడు. ‘గతంలో వినాయకచవితికి వినాయకుడి బొమ్మలు అమ్మినట్లే.. ఇప్పుడు దీపావళికి దీపాలో, మందులో ఏవో ఒకటి అమ్మడానికి సౌర్య అక్కడికి వస్తుందని గట్టిగా నమ్ముతాడు కార్తీక్. అలానే ఆలోచించుకుంటూ ముందుకు నడిచి వస్తూ ఉంటాడు. ‘అమ్మా సౌర్యా నువ్వు ఎక్కడున్నావ్.? ఎవరి దగ్గర ఉన్నావ్?’ అంటూ మనసులోనే మథనపడుతూ ఉంటాడు.
సౌర్యని వెతుకుతూ ఊర్లోకి వచ్చిన కార్తీక్ అక్కడ ఎంతోమందిని ఆరా తీస్తాడు. ఎటువంటి సమాచారం దొరకదు. అయినా వినాయక చవితికి విగ్రహాలు అమ్మడానికి వచ్చిన సౌర్య.. దీపావళి టపాసులు, దీపాలు అమ్మడానికి వచ్చే అవకాశం ఉందని కార్తీక్ గట్టిగా నమ్ముతాడు. అలాగే.. సౌర్య పెద్దమనిషి అవడంతో ఫంక్షన్‌కి అవసరమైన సామాన్లు కొనడానికి అక్కడికే వస్తాడు ఇంద్రుడు. కానీ వాటికి అవసరమైన డబ్బులు తన దగ్గర ఉండవు. ఇక చేసేది లేక.. సౌర్యకి ఇచ్చిన మాటని పక్కకి పెట్టి.. తనని క్షమించమని మనసులోనే కోరుకుని.. అక్కడే ఉన్న ఓ యువకుడి పర్సు కొట్టేయడానికి ఇంద్రుడు సిద్ధమవుతాడు. ఇంద్రుడు చేయి ఆ పర్సు దగ్గరకి వెళ్లే క్రమంలోనే ఓ చేయి వచ్చి అతని చేతిని పట్టుకుంటుంది. అది మరేవరో కాదు దీప. ఆమెని చూసి మొదట షాకైన ఇంద్రుడు దీపని గుర్తు పట్టేస్తాడు. దీప కూడా ఇంద్రుడ్ని గుర్తు పట్టి ఆటో నడుపుకునే తను దొంగతనం ఎందుకు చేస్తున్నావని అడుగుతుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ‘ఆ దొంగ నీకు ఎలా పరిచయం వంటలక్క’ అని అడుగుతాడు. దానికి.. ‘మనం వెతుకుతున్నది ఇతని గురించే డాక్టర్ బాబు’ అని అంటుంది దీప. అది విని ఆ పేర్లు ఎక్కడో విన్నట్లు ఉన్నాయని ఆలోచనలో పడతాడు ఇంద్రుడు.
అయితే.. కార్తీక్ ముఖం చూసి తనని పోలీసులకి పట్టించొద్దని రిక్వెస్టు చేస్తాడు ఇంద్రుడు. కార్తీక్ కూడా ఒకేనంటాడు. అనంతరం.. ‘సౌర్య పెద్ద మనిషి అయ్యింది. వాటికి కావాల్సిన సరుకులు కొనడానికి డబ్బులు లేవు. అందుకే దొంగతనం చేయాలనుకున్నాను’ అని అంటాడు ఇంద్రుడు. అది విని మొదట సంతోషపడిన దీప.. అనంతరం సౌర్య పరిస్థితి ఇలా అయ్యిందని బాధగా అంటుంది దీప. అది చూసి దీపని ఓదార్చుతాడు కార్తీక్. అనంతరం ఇంద్రుడిని బట్టలు, బంగారు కొనడానికి షాపుకి తీసుకెళతాడు.
అక్కడ మోనిత మాత్రం.. ప్రియమణి గురించి కార్తీక్ మాట్లాడిన మాటలను తలచుకుని కంగారు పడుతుంటుంది. అతనికి గతం గుర్తొచ్చిన కావాలనే నాటకాలు ఆడుతున్నాడా అని అనుమానంగా మనసులో అనుకుంటుంది మోనిత. ఇంతలో అక్కడి వాల్తేరు వాణి వస్తుంది. దాంతో.. ఎవరైనా చూస్తే కొంపలు మునుగుతాయని కంగారుగా అంటుంది మోనిత. దానికి.. ‘దీప, మీ మొగుడు కలిసి ఎక్కడికో వెళ్లారు’ అని చెబుతుంది వాణి. దాంతో ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదని ఇద్దరినీ తిట్టుకుంటుంది మోనిత. అలాగే.. దీపని ఎందుకు చంపలేదని అడుగుతుంది మోనిత. కార్తీక్ రాకుంటే అన్ని పనులు పూర్తయ్యేయని చెబుతుంది వాణి. అలాగే.. దుర్గని పోలీసులకి పట్టించుచొచ్చు కదా అని వాణి అడిగితే.. ఇంతకుముందు జరిగిన విషయాలను చెబుతుంది మోనిత. అలాగే.. ఏదో ఒకటి త్వరగా తేల్చమని వాణికి చెబుతుంది మోనిత.
దీప, కార్తీక్ కలిసి సౌర్యకి బట్టలు, నగలు కొని ఇంద్రుడికి అందిస్తారు. ‘వీటి కోసమే కదా.. నువ్వు దొంగతనం చేయబోయింది. ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు’ అని హిత బోధ చేస్తుంది దీప. వాటిని ఆటోలో పెట్టిన ఇంద్రుడు టెన్షన్ పడుతుంటాడు. అది చూసి ఎందుకు అలా ఉన్నావని కార్తీక్ అడిగితే ఏం లేదని చెబుతాడు.
సరేనన్న దీప.. ఇంద్రుడిని ఇంటికి తీసుకెళ్లమని చెబుతుంది. దాంతో ఇల్లంతా గందరగోళంగా ఉందమ్మా.. రేపు రండి అని అబద్ధం చెబుతాడు ఇంద్రుడు. దీప ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక కారణం చెబుతుంటాడు తప్ప.. ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పుకోడు. దాంతో ఇంద్రుడి వాలకం చూసిన కార్తీక్‌కి అనుమానం వస్తుంది. దాంతో.. పాప ఫొటో చూపించమని ఇంద్రుడిని అడుగుతాడు కార్తీక్. అది విని.. వెంటనే ఫోన్‌లో ఉన్న పిక్స్ అన్నింటిని డిలీట్ చేసి.. ఫొన్ సమస్య వల్ల అన్ని పోయాయని అబద్ధం చెబుతాడు ఇంద్రుడు. దాంతో దీప బాధ పడుతూ.. రేపు ఇక్కడే ఉంటామని, వచ్చి ఇంటికి తీసుకెళ్లమని అడుగుతుంది దీప. సరేనని త్వరత్వరగా ఆటో తీసుకుని వెళ్లిపోతాడు ఇంద్రుడు.
అక్కడ అమ్మనాన్న గురించి తలచుకుని సౌర్య బాధ పడుతుంటుంది. అది చూసి ఏమైందని అడుగుతుంది చంద్రమ్మ. దాంతో.. ఈ సమయంలో అమ్మ ఉంటే ఈ సమయంలో ఎంత సందడి చేసేదో కదా పిన్ని అని బాధగా అంటుంది సౌర్య. దానికి.. రేపటి నుంచి మళ్లీ వెతకొచ్చని సముదాయిస్తుంది చంద్రమ్మ. అయితే.. దీపకి, కార్తీక్‌కి అబద్ధం చెప్పి తప్పించుకొచ్చిన ఇంద్రుడు.. కొంచెం దూరం వెళ్లిన తర్వాత సౌర్య గురించే ఆలోచిస్తూ బాధగా పడుతుంటాడు. ఇంద్రుడిలో మార్పు వచ్చి దీపని, కార్తీక్‌ని సౌర్య దగ్గరకి తీసుకెళతాడో లేదో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.