తనని ఇబ్బంది పెడుతున్నాడని దుర్గని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని తీసుకొస్తుంది మోనిత. అయితే.. మోనితనే రివర్స్‌లో మోనితనే కార్తీక్ ఇరికిస్తాడు. దుర్గ మంచోడేనని, మోనితనే గతం మరిచిపోయిందని ఏవేవో చెబుతాడు. అది విని బిత్తర పోయి చూస్తుంటుంది మోనిత. అనంతరం దీపకి ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించమని పోలీసులని రిక్వెస్ట్ చేస్తాడు కార్తీక్. ఆ తర్వాత నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దీపకి ఎవరి వల్ల ప్రాణహాని ఉందని అడుగుతాడు ఎస్సై. దానికి.. వెంటనే మోనిత వైపు వేలు చూపిస్తాడు కార్తీక్. దానికి షాకై చూస్తున్న మోనితని.. ‘దీప మీద దాడి జరగడం నీకు తెలుసు కదా. వాళ్లని నువ్వు గుర్తుపట్టగలవా?’ అంటాడు కార్తీక్. దాడి చీకటిలో జరిగిందని, తను గుర్తు పట్టకపోవచ్చని ఎస్సైకి తనే చెబుతాడు కార్తీక్. అది విని.. ‘మా దగ్గర ఉన్న లిస్ట్‌లో కొందరు రౌడీలు ఉన్నారు. వారిని పిలిచి విచారణ జరిపిస్తాను’ అని అక్కడి నుంచి వెళ్లిపోతారు పోలీసులు. అనంతరం సహాయం చేసినందుకు.. దీప, దుర్గ కార్తీక్‌కి థాంక్స్ చెప్పి వెళ్లిపోతారు.
వారు వెళ్లగానే.. ఇలా చేశావంటేనని కార్తీక్‌ని నిలదీస్తుంది మోనిత. దాంతో.. ‘దుర్గని స్నేహితుడని ఇంట్లో పెట్టుకున్న నువ్వే.. అతన్ని క్రిమినల్ అంటే నీ మీద కూడా అనుమానం వస్తుంది కదా. నువ్వు జైలుకి వెళితే నేను ఒంటరిని అయిపోతానని అలా చేశాను’ అని కవర్ చేస్తాడు కార్తీక్. దాంతో.. దీప గురించి ఎందుకు మాట్లాడవని లాజిక్ తీస్తుంది మోనిత. దానికి కూడా.. వంటలక్కకి ఏమైనా నువ్వే ఇరుక్కుంటావని అలా చేశానని అంటాడు కార్తీక్. దాంతో.. అతనికి అన్ని గుర్తుంటున్నాయిగా అని అడుగుతుంది మోనిత. తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి అన్ని గుర్తుంటున్నాయని.. కానీ గతం గుర్తు రావట్లేదని చెబుతాడు కార్తీక్.
ఇంకోవైపు.. పోలీసుల దగ్గరని నుంచే సేవ్ చేసినందుకు కార్తీక్ ఫొటో పెట్టుకుని పూజ చేస్తుంటాడు దుర్గ. అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత.. అంత అయిపోయిందని సంబరాలు చేసుకోకు.. ముందు ఉంది ముసళ్ల పండుగ అన్నట్లు మాట్లాడుతుంటుంది. దానికి.. ‘కార్తీక్ సర్‌కి మన మీద అనుమానం వచ్చింది. అందుకే నిన్ను వదిలించుకోవాలని నన్ను పోలీసుల నుంచి కాపాడినట్లు ఉన్నాడు’ అని నిప్పు రాజేస్తాడు దుర్గ. దాంతో నిజమేనేమోనని ఆలోచనలో పడుతుంది మోనిత.
అనంతరం.. ఇళ్లు ఊడుస్తున్న పని మనిషి శివలతకి సోఫా కింద టాబ్లెట్స్ దొరుకుతాయి. వాటిని మోనితకి చూపించడంతో.. ఆమె షాక్ అవుతుంది. కొంపదీసి కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా అని కంగారుగా అనుకుంటుంది. అలాగే.. దుర్గ, దీప బారి నుంచి ఏలాగైనా తప్పించుకోవాలని పథకం ఆలోచిస్తుంది. అనంతరం.. కార్తీక్, దీప దగ్గరకి వెళ్లడేమోననే అనుమానంతో అక్కడికి వెళుతుంది మోనిత. అక్కడ కార్తీక్ లేడని తెలిసి.. ‘నీ మొగుడు నాకే సొంతం.. కార్తీక్ నావాడు.. నీ అంతు చూస్తాను’ అంటూ ఇంతకుముందు ఆమె చేసిన నేరాల గురించి ఆవేశంగా మాట్లాడుతుంది మోనిత. అదంతా విన్న దీప.. చాలా కూల్‌గా లోపలే ఉన్న కార్తీక్‌ని బయటికి పిలుస్తుంది. దాంతో.. మోనిత పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయిపోతుంది. అయినా.. అవి దీపని రెచ్చగొట్టడానికి అన్న మాటలను కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది మోనిత. దాంతో.. దీప పడి పడి నవ్వుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.