గత ఎపిసోడ్‌లో.. కార్తీక్‌ని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్న మోనితకి దుర్గ ఎదురుపడతాడు. అతన్ని నుంచి తప్పించుకున్న మోనిత అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆమెని వెతుకుంటూ వచ్చిన దుర్గకి దీప కనిపిస్తుంది. దాంతో.. అన్ని విషయాలను దుర్గకి వివరించి చెబుతుంది దీప. దాంతో.. ఆమె సంగతి తనకి వదిలేయమని దీపకి భరోసా ఇచ్చి.. మోనిత ఇంటికి వెళతాడు దుర్గ. అక్కడ కార్తీక్ కి ఫ్రెండ్‌ని అని పరిచయం చేసుకుంటాడు దుర్గ. అనంతరం మోనితతో క్లోజ్‌గా ఉంటాడు. అది చూసిన కార్తీక్ కి ఒళ్లు మండిపోతుంటుంది. అదే విషయం దీపకి చెప్పి బాధపడతాడు. ఆ తర్వాత అక్టోబర్ 1న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మోనితకి ఇష్టం లేదని వెళ్లిపోతున్న దుర్గని అక్కడే ఉండమంటాడు కార్తీక్. దాంతో.. తనకి ఇష్టం లేదు కదా అందుకే వెళ్లిపోతానని అంటాడు దుర్గ. మోనిత అలాగే మాట్లాడుతుందని చెప్పి అక్కడే ఉండమని చెబుతూ కార్తీక్ నే సపోర్టు చేస్తుంది దీప. దాంతో సరేనంటాడు దుర్గ. అనంతరం అక్కడి నుంచి అందరు వెళ్లిపోయాక.. మోనితతో ట్విస్ట్ ఊహించలేదు కదా అని వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
మరోవైపు.. హిమని స్కూల్ కి తీసుకెళుతూ ఉంటుంది సౌందర్య. సౌర్య లేకపోవడంతో హిమ ఒంటరై పోయిందని మనసులో అనుకుంటుంది సౌందర్య. ఇంతలో ఆలోచన నుంచి బయటికి వచ్చిన హిమ.. ‘సౌర్యకి అంత పట్టుదల, మొండితనం ఎవరి నుంచి వచ్చాయి నాన్నమ్మ. అమ్మనాన్నకి అలాంటివి తెలియదు కదా’ అని సౌందర్యతో అంటుంది. వాళ్లిద్దరు పట్టుదలకి, మొండితనానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మనసులో అనుకుంటుంద సౌందర్య. ఆ విషయాన్ని దాటవేస్తూ.. ‘కొంచెం ముందు వెళితే ఆనంద్‌ని తీసుకొచ్చుకునేవాళ్లం కదా’ అంటుంది సౌందర్య. దాంతో.. ‘వెళ్లకపోవడమే మంచిదైంది నాన్నమ్మ. మాకు ఏలాగైనా అమ్మనాన్న లేరు. తమ్ముడైన వాడి అమ్మ దగ్గర పెరుగుతాడు కదా’ అంటుంది హిమ. సౌందర్య కూడా నిజమే కదా అనుకుంటుంది.
అనంతరం.. ఇంటి దగ్గర ఉన్న దీప దగ్గరకి వస్తాడు దుర్గ. మోనిత ఎలా టెన్షన్ పడుతుందో చూశావా దీపమ్మ అంటాడు దుర్గ. అది విని.. ‘అది సడెన్‌గా వచ్చిన సమస్య కావడంతో అలా రియాక్ట్ అయ్యింది. కొద్ది రోజులు పోతే ఏదో ప్లాన్ వేసి మననే ఇబ్బంది పెడుతుంది. అందుకే ముళ్లుని ముళ్లుతోనే తీయాలి’ అని అంటుంది దీప. వంటలక్క ఉద్దేశం అర్థమయిన దుర్గ.. ‘అక్కడే ఉంటా కదా.. మన ప్లాన వర్కౌట్ చేస్తా. నువ్వు లంచ్ చేసి తీసురా దీపమ్మ’ అని చెప్పి మోనిత ఇంటికి వెళ్లిపోతాడు దుర్గ.
ఇంకోవైపు.. ‘వాడిని ఏలాగైనా వదిలించుకోవాలని అనుకుంటే.. లాగేజీ తీసుకోస్తానని వెళ్లాడు. దీపతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే జాగ్రత్త పడాలి’ అని మనసులో అనుకుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. ఆమె సమాధానం చెప్పబోయేలోపు.. దుర్గ అక్కడికి వచ్చాడు. దాంతో.. మోనితతో స్పెషల్ వంట చేయమని చెబుతాడు కార్తీక్. అది విని.. ‘నాకు ఓ ఏడాది వంట చేసి పెట్టింది సార్. తినడం నా వల్ల కాదు. బాలేదని నిజం చెబితే ఒప్పుకోకుండా బుంగమూతి పెడతది’ అని అంటాడు దుర్గ. అదేం లేదు కార్తీక్ అని కోపంగా అంటుంది మోనిత. దాంతో.. ‘నువ్వు అలా అంటే మన మధ్య జరిగిన ఎన్నో విషయాలను వివరంగా చెప్పాల్సి వస్తుంది మోనిత’ అని వరుసగా అంటాడు దుర్గ. ఇంతలో దీప అక్కడికి వచ్చిన దీపతో దుర్గకి మోనిత వంట చేసి పెట్టిందంట అని చెబుతాడు కార్తీక్. దాంతో.. రెచ్చిపోయిన దుర్గ మరో నాలుగు కల్పించి చెబుతాడు. అది విన్న కార్తీక్ ముఖం మారిపోతుంది. అది చూసి ఇంకెప్పుడు మనం సార్ ముందు మన గతం గురించి మాట్లాడొద్దు మోనిత అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దుర్గ.
తర్వాత కోపంగా దీపని చేయి పట్టుకుని బయటికి లాక్కొస్తుంది మోనిత. దుర్గతో కలిసి ఏం నాటకాలు ఆడుతున్నావని కోపంగా అంటుంది. దాంతో.. ‘నేను కేవలం వైఫ్‌ని. నువ్వు వైవర్‌వి కదా. అంటే వైఫ్ ప్లస్ లవర్‌వి కదా. నీ అన్ని నాటకాలు మా వల్ల కాదు’ అని వెటకారంగా అంటుంది దీప. దాంతో పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే బావుండదని వార్నింగ్ ఇస్తుంది మోనిత. అది విని.. ‘ఇవన్నీ ఉండొద్దంటే.. డాక్టర్ బాబుకి నిజం చెప్పేయి. అప్పుడు ఏ బాధ ఉండదు కదా’ అంటుంది దీప. అది అస్సలు కుదరదని కోపంగా అంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ఏం నిజమని అడుగుతాడు. ఏం లేదని మోనిత కవర్ చేయబోతుంది. కానీ.. దుర్గ అంటే ఎందుకు ఇష్టం లేదో డాక్టర్ బాబుకి కారణం చెప్పొచ్చు కదా అని అంటుంది దీప. నిజం చెబితే అర్థం చేసుకుంటానని అంటాడు కార్తీక్. కానీ అలాంటిది ఏం లేదని కార్తీక్‌ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.
అనంతరం ఇంటికి వెళ్లిన దీపకి అక్కడ కూర్చున్న దుర్గ కనిపిస్తాడు. ఇక్కడ ఉన్నావెంటని అడుగుతుంది దీప. దానికి మరి మోనితని ఉక్కిరి బిక్కిరి చేయడం ఇష్టం లేక ఇలా వచ్చానని అంటాడు దుర్గ. దాంతో.. ‘దానికి గ్యాప్ ఇవ్వకూడదు. అలా చేస్తే అది మననే ఇబ్బంది పెడుతుంది. ఒక వారం ఇలా ఇరిటేట్ చేస్తే దారిలోకి వస్తుంది’ అని అంటుంది దీప. సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయిన దుర్గకి బట్టలు సర్దుతున్న మోనిత కనిపిస్తుంది. దుర్గని చూసి ఇక్కడికి ఎందుకొచ్చావని అడుగుతుంది మోనిత. కోప్పడకు బంగారమంటూ మోనిత చేయి పట్టుకుంటాడు దుర్గ. అప్పుడే అటుగా వచ్చిన కార్తీక్ అది చూస్తాడు. దాంతో.. కోపం తగ్గలేదని చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతున్నానని కావాలనే కార్తీక్‌కి అనుమానం వచ్చేలా అంటాడు దుర్గ. ‘సగం నేను మేనేజ్ చేశాను. మిగిలిన సగం నువ్వు మేనేజ్ చేయి’ అని కార్తీక్‌కి వినపడేలా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు దుర్గ. దాంతో శివ ఎక్కడా అని కార్తీక్ అడిగితే.. బయటికి పంపామని చెబుతుంది మోనిత. దాంతో ‘మీకు అడ్డు అని వాడిని కూడా బయటికి పంపవా’ అని కోపంగా అని దూరంగా వెళ్లిపోతాడు కార్తీక్. మోనిత పిలుస్తున్నా ఆగడు.
తర్వాత చాలా డల్‌గా దీప దగ్గరకి వెళతాడు కార్తీక్. అతన్ని చూసి కుర్చీ ఇచ్చి కూర్చమంటుంది. దాంతో.. తన మనసు బాలేదని బాధగా అంటుంటాడు కార్తీక్. మోనిత గురించి దీపకి చెప్పబోతుండగా అక్కడికి వచ్చిన శివ.. ‘మిమ్మల్ని ఓ రెండు గంటలు బయటికి వెళ్లి తీసుకురమ్మన్నారు సర్’ అంటాడు. దాంతో కొంచెం అనుమానంగా చూస్తుంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.