మోనిత ఏదైన చేస్తుందనే భయంతో దీపకి తెలియకుండా.. ఆమె ఇంటి ముందే కాపలా ఉంటాడు కార్తీక్. ఉదయం లేచిన దీప కార్తీక్‌ని చూసి విషయం ఏంటని అడిగినా ఏం చెప్పడు. అయితే.. తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టమని అడుగుతాడు. భార్య చేసిచ్చిన కాఫీని తాగుతుంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. తన భర్తని రాత్రంతా తన దగ్గరే ఉంచుకుందని దీపని తిడుతుంది. దాంతో.. కోపం వచ్చిన దీప లాగిపెట్టి మోనిత చెంప మీద కొడుతుంది. అయినా ఏం పట్టించుకోడు కార్తీక్. అది చూసి.. అతనిపై అరుస్తుంది మోనిత. దాంతో.. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అనంతరం దుర్గ కావాలని ఓవర్ యాక్షన్ చేసి మోనిత మీద కార్తీక్‌కి కోపం వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 19న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రౌడీలు కొట్టడంతో కోమాలోకి వెళ్లిన వారణాసిని చూడటానికి హాస్పిటల్‌కి వెళతాడు కార్తీక్. వారణాసి త్వరగా కోరుకోవాలని కోరుకుంటాడు. అతని ఆరోగ్యం కుదట పడ్డాక తన ఇంట్లో మనిషిగా చూసుకోవాలని అనుకుంటాడు. అలాగే.. అతని ఆరోగ్య వివరాలు అక్కడి డాక్టర్‌ని అడిగి తెలుసుకుంటాడు. అయితే.. కార్తీక్ డాక్టర్ అని తెలిసిన.. ఆ డాక్టర్ తమ హాస్పిటల్‌లో ఏవైన ఆపరేషన్స్ చేయడానికి పిలుస్తానని చెబుతాడు. అక్కడ కార్తీక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు డాక్టర్ అన్నయ్య, దీప. సంగారెడ్డిలో రౌడీలు ఎటాక్ చేసిన దగ్గర నుంచి ఆయన చాలా మార్పు వచ్చిందని సంతోషంగా చెబుతుంది దీప. అది మంచిదే కదమ్మా.. దీపకి మంచి రోజులు వచ్చినట్లేనని సంతోషంగా అంటాడు డాక్టర్ అన్నయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గ కూడా అదే నిజమని అంటాడు. అతన్ని చూసి కార్తీక్ గురించి ఆరా తీస్తుంది దీప. కానీ.. కార్తీక్ ఇంట్లో లేడని దుర్గ చెబుతాడు.
మరోవైపు.. కార్తీక్ ఎక్కడికి వెళ్లాడని కంగారు పడుతుంటుంది మోనిత. దుర్గ వచ్చిన తర్వాత అతనిలో చాలా మార్పు వచ్చిందని అతన్ని తిట్టుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్‌ని ఎక్కడికి వెళ్లావని కంగారుగా అడుగుతుంది మోనిత. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్లానని అబద్దం చెబుతాడు కార్తీక్. తర్వాత అతనికి ఎప్పుడు ఇచ్చే టాబ్లెట్లని ఇచ్చి వేసుకోమని చెప్పి టీ తీసుకురాడానికి లోపలికి వెళుతుంది మోనిత. దాంతో.. ఏం టాబ్లెట్లని చూసిన కార్తీక్.. అందులో నుంచి ఒక టాబ్లెట్‌ని తీసి పారేసి.. మింగినట్లు మోనిత ముందు కలరింగ్ ఇస్తాడు. ఇంకోవైపు.. కార్తీక్ ధ్యాసలో పడి ఇంటిని పట్టించుకోడం మర్చిపోయానని.. ఇల్లు సర్దుతుంటుంది దీప. దాంతో.. తనతోపాటు ఇంటి రావొచ్చు కదమ్మా అని డాక్టర్ హేమచంద్ర అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ‘అదేం అవసరం లేదు హేమచంద్ర గారు’ అంటాడు కార్తీక్. దాంతో.. కార్తీక్ని చూసి ఎవరు కాల్ చేశారని అడుగుతుంది దీప. అది విని కస్టమర్ కేర్ వాడు కాల్ చేస్తే అలా బిల్డప్ ఇచ్చి బయటికి వెళ్లానని చెబుతాడు కార్తీక్. అది విని.. ‘పెళ్లం బాధ పడలేక చాలామంది మగాళ్లు అలాగే చేస్తారమ్మా’ అని జోక్ చేస్తాడు హేమచంద్ర. అనంతరం పనుందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు హేమచంద్ర. అతను వెళ్లిన తర్వాత దీప, కార్తీక్ కలిసి ఇంటిని శుభ్రం చేస్తారు. అనంతరం తనే వంట చేస్తానని అంటాడు కార్తీక్.
అనంతరం.. సౌర్యని వెతికి దొరకకపోవడంతో నిరాసంగా వస్తుంటాడు శివ. అతన్ని చూసి ఇష్ట మొచ్చినట్లు తిరుగుతున్నావని జాబ్‌లో నుంచి తీసేస్తానని అతన్ని బెదిరిస్తుంది మోనిత. దాంతో.. భయపడిన శివ.. సౌర్యని కార్తీక్ వెతకమన్న విషయాన్ని చెబుతాడు శివ. అది విన్న మోనిత.. వెతుకుతున్నట్లు నాటకం ఆడితే రూ.2000 పెంచుతానని చెప్పడంతో అలాగే అని సంతోషంగా అంటాడు శివ. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. దీప, కార్తీక్ గురించి చెబుతాడు. దాంతో.. ఆవేశంగా అక్కడికి వెళుతుంది మోనిత.
అక్కడ వంట పూర్తి చేసిన కార్తీక్.. దీపకి వడ్డిస్తుంటాడు. ఇంతలో అక్కడకి వచ్చిన మోనిత.. ‘ముద్దలు కలిపి నోట్లో కూడా పెట్టు’ అని కోపంగా అంటుంది. నా కార్తీక్‌తో వంట చేయిస్తావా అని దీప మీద అరుస్తుంది మోనిత. ‘నువ్వు ఇంట్లో సరిగ్గా ఉంటే నేనేందుకు ఇలా ఉంటాను. మీకు అడ్డమని బయటికి వెళ్లమని అంటున్నావు’ అని చురకలు అంటిస్తాడు కార్తీక్. దానికి దీప కూడా.. ‘నీకు, దుర్గకి అడ్డమని శివతో డాక్టర్ బాబుని రెండు గంటలు బయటికి తీసుకెళ్లమని చెప్పవంట కదా’ అని కొంచెం పెట్రోలు పోస్తుంది. అది విని.. నోర్ముయ్ అని కోపంగా అరుస్తుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్ చూడండి.