గత ఎపిసోడ్‌లో.. ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డ దీప, సౌర్య కోసం సంగారెడ్డి వెళుతుంది. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. అయితే ఆ ఇంట్లో కార్తీక్ ఫొటోకి దండేసి ఉండడం చూసి కన్నీరు పెట్టుకుంటుంది దీప. అలాగే కార్తీక్‌ని ఆ ఊరి నుంచి తీసుకెళ్లాలని అనుకుంటుంది మోనిత. అయితే కార్తీక్ మాత్రం మోనిత నానా మాటలు అంటాడు. దాంతో అతన్ని కొట్టేందుకు చేయొత్తుతుంది మోనిత. ఆ తర్వాత నవంబర్ 24న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘దుర్గ ఏదో చేస్తే నువ్వు నన్ను అనుమానిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది కార్తీక్. వాడిని దీపనే సెట్ చేసింది’ అని బాధగా అంటుంది మోనిత. అది విని.. ‘నేను నిజంగా నీ భర్తనేనా. అయితే నీకు కంగారు ఎందుకు’ అని ప్రశ్నిస్తాడు కార్తీక్. దాంతో.. నిన్ను నాకు దూరం చేయాలని దీప అలా ప్రవర్తిస్తోందని బాధపడుతుంది మోనిత. అయినా నిజం ఏంటో తెలిసిన కార్తీక్ మోనితకి తనకి గతం గుర్తొచ్చిన విషయం అర్థం కాకుడదని అలా ప్రవర్తించి వెళ్లిపోతాడు.
అదే సమయంలో కార్తీక్ ఫొటోని పట్టుకుని బాధపడుతుంటుంది దీప. అప్పుడే అక్కడికి ఆ ఇంటి ఓనర్ వస్తుంది. దీప చేతిలో ఉన్న కార్తీక్ ఫొటో చూసి.. ‘నా భర్త చావుకి బాధ్యత వహిస్తూ ఆయన ఆస్తులు నాకు రాసిచ్చాడు’ అని బాధగా అంటుంది ఆ మహిళ. కారు యాక్సిడెంట్‌లో ఆయన చనిపోవడం వల్ల అలా ఆయన ఫొటోకి దండేశానని చెబుతుంది ఆ మహిళ. దాంతో.. ఆయన చనిపోలేదని, ఆయన భార్య తనేనని చెబుతుంది దీప. అది విని చాలా సంతోషపడిన ఆ మహిళ సౌర్యని వెతకడానికి అన్ని రకాలుగా సహాయం చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
ఇంకోవైపు.. మోనితని ఎక్కడికి వెళుతున్నావని అడుగుతాడు కార్తీక్. అది విని చాలా సంతోషించిన మోనిత.. ‘వంటలక్క మన మధ్యలోకి వచ్చేవరకు నువ్వు ఇలాగే ప్రేమగా ఉండేవాడివి’ అని అంటుంది. దాంతో.. మోనిత ఎన్ని నాటకాలు ఆడుతోందని మనసులో అనుకుంటాడు కార్తీక్. అది తెలియని మోనిత సంతోషంగా షాపింగ్‌కి వెళ్లిపోతుంది. అదే సమయంలో సౌర్యని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతుంటుంది దీప. నడుస్తున్నప్పుడు దీపకి చాలా నీరసంగా అనిపిస్తుంది. దాంతో తన దగ్గరకి భర్తని, పిల్లలని చేర్చి ఎన్ని కష్టాలైన పెట్టమని దేవుడిని కోరుకుంటుంది దీప. ఇంతలో ఆమె మీదకి ఓ పోస్టర్ వచ్చి పడుతుంది. అది సౌర్య ఫొటో ఉన్న పోస్టర్. దాంతో సౌర్య కూడా తమ కోసం వెతుకుతోందని సంతోషపడుతుంది. ఇంతలో అక్కడికి దీప ఇంటి ఓనర్ వస్తుంది. ఆమె విషయం చెబుతుంది దీప. ఆమె వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పడంతో అలాగే చేస్తుంటుంది దీప.
మరోవైపు.. దీప గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. దీపని ఒంటరిగా పంపించి తప్పు చేశానని, ఆమె ఆరోగ్యం బాగాలేదని బాధగా అనుకుంటాడు కార్తీక్. ఇంతలో దుర్గ అక్కడికి వస్తాడు. దాంతో.. తనకి గతం గుర్తొచ్చిందని, నాటకాలు ఆపామని చెబుతాడు కార్తీక్. అది విని దుర్గ చాలా సంతోషిస్తాడు. ఆ విషయం మోనితకి, దీపకి చెప్పొచ్చు కదా అని అంటాడు దుర్గ. దానికి ఇంకా సమయం ఉందని చెప్పి.. తను దీప దగ్గరకి వెళతానంటాడు కార్తీక్. మోనితకి సందేహం రాకుండా చూసుకోమని దుర్గకి చెబుతాడు కార్తీక్. దుర్గ కూడా ఓకే అంటాడు. అదే సమయంలో.. పోస్టర్ మీద నెంబర్‌కి ఫోన్ చేసి.. ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్‌కి వెళుతుంది దీప. అతన్ని చూసి బాధ పడుతుంది దీప. అతన్ని అడిగితే ఆ నెంబర్ తనేదేనని, ఆ పోస్టర్ మీదకి ఎలా వచ్చిందో తెలియదని చెబుతాడు ఆ వ్యక్తి. దాంతో కన్నీరు పెట్టుకుంటుంది దీప. ఇంద్రుడు కావాలనే తన కూతురిని తమకి దూరం చేస్తున్నాడని బాధగా తన ఇంటి ఓనర్ మహిళతో అంటుంది దీప. ఆమె కూడా దీపకి సౌర్య దొరకాలని దేవుడి ప్రార్థిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.