మోనిత నుంచి తప్పించుకుని ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తాడు కార్తీక్. ఇంద్రుడితో కలిసి తన పోస్టర్లని అతికిస్తుంది సౌర్య. ఇంకోవైపు.. దీపకి మాటిమాటికి కళ్లు తిరుగుతుంటాయి. అలాగే.. మోనిత నుంచి నిజం తెలుసుకోడానికి బయట తాళం వేసి తాను ఆమె ఇంట్లో ఉంటాడు దుర్గ. ఆ తర్వాత నవంబర్ 23న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఇంటికి తాళం వేసుండడం, దుర్గ లోపల ఉండడంతో కార్తీక్ ఏం అనుకుంటాడోనని భయపడుతుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్‌తో ‘ఇంటికి తాళాలు వేసుంటే కార్తీక్ బయటకి వెళ్లిపోతాడని చెప్పి.. నన్ను లోపల పెట్టి తాళం వేసింది మోనిత’ అని అంటాడు దుర్గ. దాంతో.. దుర్గ దీప మనిషని అంటుంది మోనిత. అది విని.. ‘ఇన్ని రోజులు నీ మనిషని చెప్పి.. ఇప్పుడు దీప మనిషి అంటావా. దీప అక్కడ భర్త కోసం పిల్లల కోసం పూజలు చేస్తుంటే.. నువ్వేమో ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నావు’ అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
అదే సమయంలో.. అమ్మనాన్న గురించే ఆలోచిస్తుంటుంది సౌర్య. ఇంతలో అక్కడికి వచ్చిన చంద్రమ్మ అన్నం తినడానికి రమ్మని అంటుంది. అది విని తనకి ఇష్టం లేదని అంటుంది సౌర్య. దానికి.. తను తింటే చిన్నప్పుడే చనిపోయిన తన బిడ్డ పేరు మీద పూజ చేయాలని చెబుతుంది చంద్రమ్మ. అప్పుడే ఆ లోటు తీర్చడానికి ఆ దేవుడే సౌర్యని పంపించాడని సౌర్యతో అంటాడు ఇంద్రుడు. అనంతరం తనని అమ్మ అని పిలవమని రిక్వెస్టు చేస్తుంది చంద్రమ్మ. అది విని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది సౌర్య.
సౌర్యని వెతకడానికి సంగారెడ్డికి బయలుదేరుతుంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ అడిగితే.. అదే విషయం చెబుతుంది దీప. అది విని.. అసలే తన ఆరోగ్యం బాగాలేదని తనని ఆపే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. కానీ.. సౌర్యని కచ్చితంగా వెతుకుతానని అంటుంది దీప. దానికి.. ఆపరేషన్ ఉండడం వల్లే తాను దీపతో వెళ్లలేనని మనసులో బాధపడుతూ.. రేపు ఇద్దరం కలిసి వెళదామంటాడు కార్తీక్. అది విని.. తను వస్తే మోనితతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, అందుకే కార్తీక్‌ని వద్దని అంటుంది దీప. ఈ మాటలన్ని ఇంటి బయటే ఉన్న మోనిత వింటుంది. అది వద్దంటున్న కార్తీక్ విన్నట్లేదని అనుకుంటుంది మోనిత. ఇంతలో.. ‘మీకు గతం గుర్తొస్తే మీరే బాధ్యతగా వేతికేవారు’ అని కార్తీక్‌తో అంటుంది దీప. అది విన్న మోనిత.. నువ్వు వెళ్లిపోతే కార్తీక్కి గతం గుర్తు రాకుండా చూసుకుంటానని అనుకుంటుంది. కార్తీక్ మాత్రం దీప మాటలు విని మనసులో బాధ పడతాడు. అందుకే డబ్బు ఇచ్చి, తాను వీలు చూసుకుని వస్తానని అంటాడు కార్తీక్.
ఇంకోవైపు.. మోనిత దగ్గరకి వెళ్లడానికి బట్టలు సర్దుతుంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వచ్చిన ఆనందరావు ఎందుకు అని అడుగుతాడు. డాక్టర్ చెప్పిన తర్వాత వెళతానని.. మోనిత పని పట్టడానికి ఊబలాటపడుతుంది సౌందర్య. ఇంతలో హిమ వచ్చి తాను కూడా వస్తానంటే.. మంచిగా చదువుకోమని చెబుతుంది. అలాగే వంట చేయడానికి ఓ మనిషిని మాట్లడానని కూడా చెబుతుంది.
అదే సమయంలో సంగారెడ్డిలో ఓ ఇల్లు అద్దెకి తీసుకుని దిగుతుంది దీప. ఇంట్లోకి వెళ్లగానే కార్తీక్ ఫొటోకి పూలదండ వేసి ఉండడం చూసి కంగారుపడుతుంది దీప. వెంటనే తనకి తాళాలు ఇచ్చి ఆమె కోసం దీప బయటికి వెళితే అక్కడ ఆమె ఉండదు. దాంతో లోపలికి వచ్చి ఆ పూలదండని తెంపేసి.. ఆ ఇంటికి కార్తీక్ సంబంధం ఏంటని బాధగా అనుకుంటుంది దీప.
మరోవైపు.. కార్తీక్‌ని అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్లాలని అనుకుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్‌ని టిఫిన్ తినమని అడుగుతుంది మోనిత. అది విని.. ‘నువ్వు చేసే పనులకి నా కడుపు నిండుతుంది’ అని కోపంగా నానామాటలు అంటాడు కార్తీక్. అది విని కోపంగా కార్తీక్‌ని కొట్టడానికి చేయి ఎత్తుతుంది మోనిత. తర్వాత నిజం అర్థం చేసుకుని తాను ఏ తప్పుచేయలేదని కార్తీక్ని బ్రతిమిలాడుతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.