అందరి గురించి, అన్నింటి గురించి మరిచిపోయే కార్తీక్.. దీపని మాత్రం గుర్తు పెట్టుకుంటాడు. అది గమనించిన మోనిత ఉడుక్కుంటుంది. ఎలాగైనా దీపని కార్తీక్‌కి దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. దీప మాత్రం తన ప్రేమతో కార్తీక్‌కి గతాన్ని గుర్తు చేయాలనే కోరికతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. అందులో భాగంగా.. బిర్యానీ వండి తీసుకొచ్చి ప్రేమగా వడ్డిస్తుంది. అది తిని బావుందని పొగుడుతాడు కార్తీక్. మరోవైపు సౌర్య.. ఓ వైపు ఆటో నడుపుతూనే మరోవైపు అమ్మనాన్నని వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు.. దీప, కార్తీక్ చనిపోయారనుకుంటున్న వారణాసి, ఎలాగైనా నచ్చజెప్పి సౌందర్య వాళ్ల దగ్గరకి తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘ఒకప్పుడు బ్రతకడం వంటలు చేశాను.. ఇప్పుడు బతుకు కోసం వంటలు చేయాల్సి వస్తుంది. కానీ.. ఆయన నాతో చాలా చనువుగా ఉంటున్నాడు. కానీ.. పెద్దావిడ అన్నట్లు కార్తీక్‌కి మోనితకి పిల్లలు పుడితే.. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉపయోగం ఉండదు. త్వరగా ఏదో ఒకటి చేయాలి’ అని తనలో తాను అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మరో రకం వంట చేసి మోనిత ఇంటికి పట్టుకెళుతుంది. ఆ సమయంలో దీప గురించి, ఆమె ఉపాయం గురించే ఆలోచిస్తుంటుంది మోనిత. ఒంటరిగా తననే ఢికొట్టడానికి వచ్చిందా.. దాని సంగతి చూస్తా అనుకుంటుంది మోనిత. ఇంతలో శివ వచ్చి దీప వంట చేసి తీసుకొచ్చిందని చెబుతాడు. దాంతో ఎలాగైనా వారిద్దరి మధ్య దూరం పెంచాలని ఫిక్స్ అయ్యి గార్డెన్‌లో ఉన్న కార్తీక్ దగ్గరకు వెళుతుంది.
ఆ సమయంలో గార్డెన్‌లో మొక్కలకి ఉన్న కొమ్మలు కట్ చేస్తుంటాడు కార్తీక్. కావాలనే కార్తీక్ దగ్గరకి బయటికి వెళతానని శివతో అన్నావంట కదా అంటుంది మోనిత. మరిచిపోయావేమో.. కావాలంటే ఇప్పుడు వెళ్లొచ్చు అని అంటుంది. అది విని ఎప్పుడు లేనిది కొత్తగా అని అనుమానపడతాడు కార్తీక్. బయటికి వెళతావా లేకపోతే ఇంట్లోకి రా నీతో ఒకటి చెప్పాలని లోపలికి తీసుకెళుతుంది మోనిత. అదే సమయంలో.. భర్త గురించి, పిల్లల గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటుంది దీప. డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చాకా.. మోనితకి దూరంగా అమెరికా వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ మోనితనేమో కార్తీక్‌కి అతని గతం గురించి ఏవేవో కట్టుకథలు చెబుతుంటుంది మోనిత. కార్తీక్‌ది ముంబై అని.. అతను అక్కడే పుట్టి పెరిగాడని.. అయినా తెలుగు ఫ్యామిలీ కావడం.. అతని నాన్న, తాత తెలుగు పండితులు అవ్వడం వల్ల తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నాడని కల్పించి తోచినట్లు చెబుతుంది మోనిత. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పిన మర్చిపోయావని చెబుతుంది మోనిత. కానీ.. కార్తీక్‌కి మాత్రం ముంబై కాకుండా.. హైదరాబాద్ తన సొంత ఊరుగా అనిపిస్తోందని చెబుతాడు. అది నిజం కాదని బుకాయిస్తుంది మోనిత. అనంతరం ఆకలేస్తుంది టిఫిన్ పెట్టమంటాడు కార్తీక్. దాంతో వంట చేయడం కుదరదని, అందుకే రోజు మొత్తం వంటలక్కని చేయమంటానని వెళుతుంది మోనిత. కార్తీక్‌కి మాత్రం మోనిత చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో దీప ఇంటి బయటికి వచ్చి చూడగా.. అక్కడ కుర్చీలో కూర్చుని స్టైల్‌గా ఊగుతున్న మోనిత కనిపిస్తుంది. దాంతో కొంచెం ఎక్కువ చేస్తున్నావని అంటుంది దీప. దానికి.. ఇక నుంచి అంత ఎక్కువగానే ఉంటుంది ఎక్కడ తగ్గేదే లే అని పొగరుగా అంటుంది మోనిత. అది ముందే తెలుసని దీప చెప్పడంతో.. నువ్వు అర్థం చేసుకున్నట్లు కార్తీక్ అర్థం చేసుకుంటే నీ వైపు కన్నెత్తి చూసేవాడు కాదని మరింత స్ట్రాంగ్‌గా అంటుంది మోనిత. దాంతో.. ‘సూర్యుడికి మబ్బు అడ్డుపడి ప్రపంచాన్ని చీకటి చేశానని అనుకుంటుంది.. నువ్వు అంతే.. ఒక్క చిన్న సంఘటన చాలు ఆయనకి గతం గుర్తు రావడానికి.. అప్పుడు నేను అక్కడ.. నువ్వు ఎక్కడో’ అని వెటకారంగా అంటుంది దీప. అప్పుడు ‘నువ్వు గతం గుర్తు చేసేలోపు.. కార్తీక్‌ని దూరంగా ముంబై తీసుకెళతా. ఆ లోపు నీ మీద ఉన్న ఇంప్రెషన్ పొగొడతా’ వని మనసులో అనుకుంటుంది. అనంతరం డాక్టర్ బాబు టిఫిన్ కూడా నీ దగ్గర తీసురమ్మని చెప్పడు.. తీసుకురమ్మని చెప్పి అక్కడిని నుంచి వెళ్లిపోతుంది. దీప టిఫిన్ చేయడానికి రెడీ అవుతుంది.
మరోవైపు.. ఆటోలో వెళుతుంటారు సౌర్య, వారణాసి. అందులో ఆటోలో ఉన్న పెట్టెల గురించి అడిగితే.. ఆసుపత్రిలో ఇచ్చిన తర్వాత మళ్లీ అమ్మనాన్న గురించి వెతుకుదామంటాడు వారణాసి. సరేనని.. అక్కడ కూడా అమ్మానాన్న ఉండే అవకాశం ఉంది కదా అని ఆశగా అంటుంది సౌర్య. దాంతో.. యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్లి వెతుకుదామంటాడు వారణాసి. అక్కడికి వెళ్లితే ఆ ప్రమాదం గుర్తొచ్చి.. హిమ కోపం పెరుగుతుందని సౌర్య ఆవేశంగా అనడంతో.. వద్దులే అని సర్ది చెబుతాడు వారణాసి.
ఇంటికి వెళ్లగానే.. ఎక్కడికి వెళ్లావని కోపంగా అరుస్తాడు కార్తీక్. వంటలక్కతో టిఫిన్ చేయమని చెప్పడానికి వెళ్లానని చెప్పడంతో కూల్ అయిపోతాడు కార్తీక్. ఇంతలో.. టిఫిన్ చేసి తీసుకొస్తుంది దీప. ఆమెని చూసి వంటలక్క అని పిలిచి కరెక్టుగా గుర్తుంచుకున్నానా అని అడుగుతాడు కార్తీక్. దాంతో.. వంటలక్క అని హిమ పిలుస్తుంది మీరు దీప అని పిలవాలని చెబుతుంది దీప. ఒకే ఇంకోసారి గుర్తుంచుకుంటానని చెబుతాడు కార్తీక్. సమయం వచ్చినప్పుడల్లా అందరి పేర్లు కావాలనే కార్తీక్‌కి చెబుతుంటుంది దీప. అనంతరం కార్తీక్‌కి జీడిపప్పు ఉప్మా, మోనితకి ఇడ్లీ వడ్డిస్తుంది. అది తిన్న మోనిత వాంతులు చేసుకుని కళ్లు తిరిగిపడిపోతుంది. అది చూసి కార్తీక్ కంగారుగా డ్రైవర్ శివని పిలిచి డాక్టర్‌కి ఫోన్ చేయమని చెబుతాడు. అది చూస్తున్న దీపకి మోనిత నాటకం ఆడుతుందా లేదా నిజంగానే పడిపోయిందా అని మనసులో అనుకుంటూ.. ఏ జరిగిన ఎదుర్కొడానికి సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.