కార్తీక్ తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటుంది మోనిత. అందుకే కావాలనే వేలు కోరుక్కుని.. వంట చేస్తుంటే కాలిందని చెబుతుంది. అయినా కార్తీక్‌లో ఎలాంటి చలనం ఉండదు. అందుకే బ్రతికున్న తన కొడుకుని చనిపోయాడని అబద్ధం చెబుతుంది మోనిత. దాంతో కార్తీక్ దగ్గరకి తీసుకుని ఓదార్చుతాడు. మరోవైపు అమ్మనాన్నని వెతకడానికి వారణాసితో కలిసి ఆటో నడపడానికి వెళుతుంది సౌర్య. మరోవైపు ఎలాగైనా కార్తీక్‌ని దారిలోకి తెచ్చుకోడానికి వంట రుచి చూపించడానికి బయలుదేరుతుంది దీప. ఆ తర్వాత సెప్టెంబర్ 2 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దీపని కాపాడిన డాక్టర్, డాక్టర్ తల్లి, రామ్, పండు నలుగురు దిగులుగా ఇంటి ముందు నిలుచుని ఉంటారు. అప్పుడే దీప గుమ్మంలోంచి బ్యాగ్ తీసుకుని వస్తుంది. ఏం చేసిన ఇక్కడి నుంచే చేయొచ్చు కదమ్మా అంటా డాక్టర్. ‘మోనిత చాలా పెద్ద జిత్తుల మారి నక్క అన్నయ్యా.. నాకు తెలిసిందని దూరంగా తీసుకెళ్లిన తీసుకెళ్లిపోతుంది. ఆయన్ని ఎలాగైనా ఆ రాక్షసి చర నుంచి బయటపడేయాలి’ అని అంటుంది దీప. నువ్వు ఉన్నన్ని రోజులు నాకు కూతురు లేని లోటు తీర్చావని ఎమోషనల్ అవుతుంది డాక్టర్ తల్లి. అయినా ఒక్కదానికి ఉండగలవో లేదో రాంపండుని తీసుకెళ్లమని చెబుతాడు డాక్టర్. ఒంటరి పోరాటం తనకి అలవాటనేనని వద్దని వారిస్తుంది దీప. దాంతో క్షేమంగా వెళ్లి లాభంగా రా అంటూ దీపని పంపిస్తారు. కార్తీక్ గురించే ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళుతుంటుంది దీప.
మరోవైపు హిమ పుట్టినరోజు కావడంతో.. ఆనందరావుతో వెళ్లి మనవరాలిని బట్టలు కొనుక్కోమని చెబుతుంది సౌందర్య. దాంతో తను చేసుకోనని.. దానికి బదులు అనాథాశ్రమంలో పిల్లలకి బట్టలు కొనిద్దామని అంటుంది హిమ. ఎందుకే అని సౌందర్య అడగగా.. సౌర్య పరిస్థితి ఏంటో.. అందుకే పార్టీ చేసుకోనని అనడంతో ఓకే అంటారు. అంతలోనే సౌర్య ప్రవర్తన గురించి మాట్లాడుకుంటుంటే.. ‘నేను వెళ్లిపోతే సౌర్య వస్తానంటుంది కదా. నన్ను వెళ్లిపోమ్మంటారా’ అని బాధగా అంటుంది హిమ. దాంతో సౌందర్య కోపంగా కోట్టడానికి చేయ్యెత్తి అలాంటి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిస్తుంది. అనంతరం పిల్లలకు పెట్టడానికి బట్టలు కొనమని ఆనందరావు, హిమని పంపుతుంది.
మరోవైపు కార్తీక్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. కారు దిగి బొటిక్ ఎదురుగా ఉన్న గార్డెన్ కూర్చుని.. వంటలక్కని తీసుకొస్తానంటే ఎందుకు వద్దంటుందని శివతో అంటాడు కార్తీక్. దాంతో.. భర్త వెంటపడే వాళ్లని ఎందుకు రానిస్తుంది చెప్పండి అంటాడు శివ. కరెక్టే కదా అనుకుంటాడు కార్తీక్. ఇంతలో ఘుమఘుమలాడే బిర్యానీ వాసన వస్తుంది. దాంతో శివ సలహా మేరకు మోనిత దగ్గరకి వెళ్లి ఆ వంట చేసే ఆవిడనే వంటమనిషిగా తీసుకొద్దామని మాట తీసుకుంటాడు కార్తీక్. సరే అని ఆ వాసన వచ్చిన వైపు వెళ్లగా.. అక్కడ దీప వంట చేస్తూ ఉంటుంది. అది చూసి షాకై నిలుచుండిపోతుంది మోనిత. ఇంతలో కార్తీక్ వెళ్లి వంటమనిషిగా రమ్మని దీపని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఎవరి ఇంట్లో పని చేయడం ఇష్టంలేదని.. కానీ అవసరమైనప్పుడు వంట చేసిస్తానని చెబుతుంది దీప. అలాగే తన పేరు దీప అని, అలాగే పనిలో పనిగా సౌందర్య కోడలా అని, సౌర్య అమ్మా అని, హిమ వంటలక్క అని పిలుస్తుందని అందరి పేర్లు గుర్తు చేస్తుంది. దాంతో వాళ్లందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని కసురుతుంది. అనంతరం వంటకి ఖర్చు గురించి మాట్లాడి వస్తానని చెప్పి కార్తీక్‌ని పంపిస్తుంది.
కార్తీక్ అక్కడి నుంచి వెళ్లగానే మోనిత నిజస్వరూపం బయటపెడుతూ.. ‘ఏంటే ఎక్కువ చేస్తున్నావ్.. ఈ వంటలక్క అవతారం ఏంటీ?’ అంటుంది. ‘ఈ వంటలక్క ఐడియా నువ్వు ఇచ్చిందే.. డాక్టర్ బాబు నన్నే వంట మనిషిగా తీసుకొస్తానని నీతో వాదనకు దిగినప్పుడు నేను నీ బొటిక్‌లోనే ఉన్నాను బంగారం’ అని చెబుతుంది చాలా కూల్‌గా. ‘నువ్వు ఏం చేసినా నా కార్తీక్‌ని నా నుంచి తీసుకుని వెళ్లలేవు’ అంటుంది మోనిత కోపంగా. దాంతో.. దీప నవ్వుతూ.. ‘ఇంకా ముందు ముందు చాలా ఉంటుందిలే.. నీ అంతట నువ్వే వదిలేలా చేస్తాను.. ఇప్పుడే కదా ఆట మొదలైంది.. చూసుకుందాం..’ అంటుంది దీప. ‘అంత సీన్ లేదు నీకు’ అనేసి మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంట్లోకి వెళ్లిన కార్తీక్.. దీప గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తూ ఉంటారా. నేను మాత్రం దీప అని పిలవాలా అని అనుకుంటూ ఉంటాడు. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం.. చెప్పినట్లుగానే బిర్యానీ పట్టుకుని కార్తీక్ దగ్గరకి వస్తుంది దీప. ‘డాక్టర్ బాబు’ అని పిలుస్తుంది. అది విని మోనిత కోపంగా అక్కడికి వచ్చి తిడుతుంది. ‘నా పేరు మరిచిపోయారా డాక్టర్ బాబు.. మీ భార్యకు సంబంధించిన ఏ చిన్న విషయం మీకు గుర్తు లేదా?’ అంటుంది దీప. ‘తలకి దెబ్బ తగిలి గతం మరిచిపోయానంటాడు’ అంటాడు కార్తీక్. ‘అవన్నీ నీకెందుకే?’ అంటూ మోనిత అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తావని మోనితని అడుగుతాడు కార్తీక్. ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.