పొన్నియన్ సెల్వన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా కోలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని మణిరత్నం సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో మద్రాస్ టాకీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని రాజమౌళి బాహుబలి సినిమాతో ఎక్కడికి వెళ్లిన పోల్చి మీడియా ప్రశ్నలు అడుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్షన్ ఘట్టాలని బాహుబలి సినిమాతో పోల్చి చూస్తున్నారు.
దీనిపై ఇప్పటికే చాలా సందర్భాలలో మణిరత్నం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ బాహుబలితో పొన్నియన్ సెల్వన్ మూవీని పోల్చి చూడటంపై తనదైన శైలిలో స్పందించారు. మనకి ఒక బాహుబలి ఉంది అది చాలు. ఇంకో బాహుబలి అవసరం లేదు. ఈ మూవీ మణిరత్నం గారి 40 ఏళ్ల కల. ఇండియా లోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఒక నవల ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించారు. మన చరిత్రలో, ఇతిహాసాలలో చాలా గొప్ప కథలు ఉన్నాయి. అలంటి వాటిలో పొన్నియన్ సెల్వన్ కూడా ఒకటి. చారిత్రాత్మక నేపధ్యంలో ఉన్న కథ ఇది.
ఇందులో పోరాటాలు ఉంటాయి. డ్రామా ఉంటుంది. అంతకు మించి ప్రస్తుతం మనం చూస్తున్న రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు కూడా ఉంటాయి. ఇలాంటి గొప్ప కథలు మరిన్ని తెరపైకి వస్తూ ఉండాలి. మన కథలని మనం మరోసారి గుర్తు చేసుకోవాలి అని కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలితో పొన్నియన్ సెల్వన్ ని కంపారిజన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా సింపుల్ గా బాహుబలి రేంజ్ ని తగ్గించకుండానే పొన్నియన్ సెల్వన్ సినిమా రేంజ్ పెంచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.