KannaLaxminarayana: పవన్ కళ్యాణ్ జనవాణి జనసేన భరోసా కార్యక్రమంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ జనసేనకు వ్యతిరేకంగా వ్యవహరించడం.. తద్వారా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. అదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ను కలవడం అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ పరిణామాలతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని రీతిలో మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎలాగైనా వైసీపీని గద్దెదించడమే టీడీపీ, జనసేన పార్టీల ఎజెండాగా ఉండడంతో.. కావాలంటే ఒకరికోసం ఇంకొకరు తగ్గేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ పొత్తు ఫిక్స్ అయితే.. జనసేన దాదాపుగా 40 సీట్లల్లో పోటీ చేయవచ్చని. ఇక జనసేన కోరితే అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్దంగానే ఉందని చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. కొందరు రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ముందుగానే తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో సమాలోచనలు జరపడం కొత్త చర్చకు తెరలేపింది. అప్పట్లో గుంటూరు జిల్లాలో చాలాసార్లు విజయం సాధించి, మంత్రిగానూ పని చేసిన అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి వదిలిన తరువాత తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
KannaLaxminarayana:
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తే.. మంచి భవిష్యత్తు ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారట.. ఇందుకోసమే ఆయన తన అనుచరులతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ సమావేశమైన తర్వాతి రోజే కన్నా లక్ష్మీనారాయణ ఈ సమావేశాలు నిర్వహించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో.. ఏపీ రాజకీయం కొత్త రూపు సంతరించుకోనుంది.