కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారు అందరూ టీడీపీ కార్యకర్తలు కావడం, అది కూడా వారు మొదటి నుంచి పార్టీలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కీలక నాయకులుగా ఉన్నవారు ఉండటం బాధించే విషయం అని చెప్పాలి. టీడీపీ పార్టీ నిర్వహించిన ఏ సభలో ఇలాంటి ఘటన గతంలో జరగలేదని స్వయంగా చంద్రబాబు చెప్పడంతో ఈ ఘటన అతన్ని ఎంతగా బాధించిందో అర్ధం చేసుకోవచ్చు. సొంత పార్టీ కార్యకర్తలని తన కోసం వచ్చిన వారిని కోల్పోవడం నిజంగా పార్టీలో ప్రతి ఒక్కరికి బాధ కలిగించే విషయం.
ఈ నేపధ్యంలోనే పార్టీ నుంచి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలలో ఒక్కొక్కరికి 25 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా క్రింద ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలాగే చనిపోయిన కుటుంబాలలో పిల్లల చదువుల బాధ్యత మొత్తం పార్టీనే చూసుకుంటుంది అని హామీ ఇచ్చారు. ఇక అధినేత చంద్రబాబు స్వయంగా చనిపోయిన బాధిత కుటుంబాల ఇళ్ళకి వెళ్లి వారిని పరామర్శించి ఓదార్చారు. అలాగే క్షతగాత్రులుగా హాస్పిటల్ లో ఉన్నవారిని పరామర్శించి వారి పూర్తి ట్రీట్మెంట్ కి కావాల్సిన ఖర్చులు మొత్తం పార్టీనే చూసుకుంటుంది అని హామీ ఇచ్చారు. అలాగే గాయపడ్డవారికి ధైర్యాన్ని ఇచ్చారు.
ఈ ఘటనతో చంద్రబాబు ఎంత బాధపడిన దానిని మనసులోనే దాచుకొని ప్రతి ఒక్కరిని ఓదార్చారు. ఇక ప్రధాని మోడీ కూడా ఈ ఘటనపై స్పందించి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకి లక్ష రూపాయిల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా లక్ష రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎంవో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించి తన సానుబూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.