లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సరైన కంటెంట్ పడితే ఇవ్వడానికి తన దగ్గర చాలా ఉందని విక్రమ్ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఏకంగా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కమల్ హాసన్ నిర్మాతగా కూడా సొంతం చేసుకున్నారు. ఇకపై కమల్ యంగ్ టాలెంటెడ్ దర్శకులతో తనకి సరిపోయే కథలతో వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అదే సమయంలో సీనియర్ దర్శకులతో కూడా చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ నేపధ్యంలో పొన్నియన్ సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత జత కడుతున్నారు. రాజ్ కమల్, మద్రాస్ టాకీస్ బ్యానర్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని చెప్పారు.
మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ అంటే ఈ సారి పాన్ ఇండియా రేంజ్ సినిమాని ఆశించొచ్చు. అదే స్థాయిలో తామిద్దరి మూవీ ఉంటుందనే విషయాన్ని కూడా కమల్ హాసన్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కుతుంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కమల్ హాసన్ తో మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.
అయితే వీరి కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉందనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే వీరి కాంబోలో రాబోయే సినిమా కథాంశం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవడానికి ఎలాగూ ఏడాది పడుతుంది. తరువాత మణిరత్నం సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లి 2024లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావిస్తున్నారు.