కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఏప్రిల్ 2023లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తనకి అలవాటైన మేకింగ్ విజన్ లోనే ఈ సినిమాని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకి వచ్చాయి. ఇక ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్ఠీఆర్ తో ప్రశాంత్ నీల్ ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి తారక్ లుక్ ఎలా ఉంటుందనేది పోస్టర్ తో ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. ఇక మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కథాంశం ఉంటుందని మాత్రం తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీపై మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తుంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్. అది కూడా హీరోగా చేయడంతో పాటు విలన్ పాత్రని కూడా తారక్ నే చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఈ రెండు పాత్రలు చాలా పవర్ ఫుల్ గా డిఫరెంట్ వేరియేషన్స్ తో ఉంటాయని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇందులో తారక్ నట విశ్వరూపం చూసే అవకాశం మరో సారి ప్రేక్షకులకి వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే జై లవకుశ సినిమాలో తారక్ మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. అందులో ఒకటి ప్రతినాయక పాత్ర కూడా ఉంది. ఆ పాత్రలో కూడా చాలా పవర్ ఫుల్ గా తారక్ నటించాడు. మరోసారి అలాంటి ప్రతినాయక పాత్రని తారక్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.