POLITICAL: రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా జేసి బ్రదర్స్ అంటే బహుశా తెలియని వారుండరు. రాజకీయంగా, వ్యాపారాల పరంగా మంచి పేరున్న కుటుంబం. జేసి బ్రదర్స్ ఒకప్పుడు అనంతపురం రాజకీయాలను శాసించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు జేసి బ్రదర్స్.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జేసి కుటుంబానికి కాస్త గ్యాప్ కొనసాగుతోందనే చెప్పవచ్చు. ముఖ్యంగా జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరోవైపు ఈడి కూడా జేసి వ్యాపారాలపైన విచారణ కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి రెండో రోజు విచారణ నిమిత్తం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు.

తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి వాహనాలను రెండు కంపెనీలకు తుక్కు కింద కొనుగోలు చేసి, వాటిని నాగాలాండ్‌లో బీఎస్-4 వాహనాల కింద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయించారని రవాణాశాఖ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొంత కాలం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి కడప జైల్లో కూడా ఉన్నారు. పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో జేసీ సోదరుల నివాసాలతో పాటు వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తు ఎంత వరకూ దారి తీస్తుందో తెలియాల్సి వుంది. ఈడీ దర్యాప్తుపై జేసీకి సొంత పార్టీ నేతలెవరూ అండగా నిలబడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజంగానే ఏదో తప్పు జరిగి ఉంటుంది అందుకే విచారణ సాగుతోందని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఈ విషయంలో టీడీపీ మౌనం వహిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.