super star Krishna : సూపర్ స్టార్ కృష్ణతో చాలా మంది అప్పటి టాప్ హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే వారిలో ఒక ఘనతను మాత్రం అప్పటి హీరోయిన్ జయప్రద సొంతం చేసుకున్నారు. అదేంటంటే నట శేఖరుడితో అత్యంత ఎక్కువ సినిమాల్లో ఆమె నటించారు. కృష్ణ, జయప్రద జంటగా 45 చిత్రాలు రూపొందాయి. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఒక హీరోయిన్ ఓ హీరోతో అన్ని చిత్రాల్లో నటించడం అసాధ్యం. ఆ క్రెడిట్ జయప్రదకే దక్కింది. మరి ఆ సినిమాలేమీ ఆషామాషీవి కాదు.. మంచి సక్సెస్ సాధించి.. వీరిద్దరూ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు.
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అక్కడ ఎవరో ఒకరి సపోర్ట్ సంపాదిస్తే తప్ప నెట్టుకురావడం చాలా కష్టం. అలా జయప్రదకు కృష్ణ సపోర్ట్ దక్కింది. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా చెబుతుంటారు. బాపు దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో కృష్ణ సరసన తొలిసారిగా జయప్రద నటించారు. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా మాత్రం సక్సెస్‌కు నోచుకోలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరిద్దరూ నటించిన రెండో సినిమా ‘మనవూరి కథ’ కూడా హిట్ కాలేదు. ఇక మూడో సినిమా నుంచి వీరిద్దరి సినిమాలు సక్సెస్ బాట పట్టాయి.
దొంగలకు దొంగ, అల్లరి బుల్లోడు చిత్రాలు వీరిద్దరి కాంబోకు మంచి సపోర్ట్‌గా నిలిచాయి. అల్లరి బుల్లోడులో అయితే కథాబలం లేకపోయినా వీరిద్దరి వల్లే ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఇక ఈ సినిమాలోని పాటలు మరో హైలైట్. ‘చుక్కల తోటలో ఎక్కడున్నావో.. ’ పాటకు ఇప్పటికీ ఆదరణ బాగానే ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకటి రెండు చిత్రాల్లో కృష్ణకు చెల్లెలిగా జయప్రద నటించారు. ఇది ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడు పడలేదు.