పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ మధ్య బద్వేల్, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలలో అలాగే ఆత్మకూరు బై పోల్ లో గాజు గ్లాసు గుర్తు వేరొక పార్టీ అభ్యర్ధికి కేటాయించడంతో జనసేన పార్టీ వ్యతిరేకులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారానికి తెరతీశారు. జనసేనాని పార్టీ గుర్తుని కూడా కాపాడుకోలేకపోయాడు అని, వచ్చే ఎన్నికలలో ఏ గుర్తు మీద పోటీ చేస్తాడో అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇక జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి ఏ ఒక్క అవకాశం దొరికిన వదులుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండదు.
దీంతో సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ గుర్తుపై విస్తృతంగా తప్పుడు ప్రచారాలు చేసింది. ఇక జనసైనికులు కూడా పార్టీ గుర్తు మీద సందిగ్ధంలో పడ్డారు. గాజుగ్లాసు గుర్తు కాకుండా పవన్ కళ్యాణ్ ఇంకా ఏదైనా గుర్తు ప్రకటిస్తారేమో అనే ఆలోచనలోకి వచ్చేశారు. దీంతో గాజుగ్లాసు సింబల్ ని కూడా కొన్ని చోట్ల తొలగించేసారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ గుర్తుపై స్పష్టత ఇచ్చింది. గాజుగ్లాసు గుర్తు జనసేనకే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఒక రాజకీయ పార్టీ నడపడానికి సరిపడా నిధులు జనసేనకి లేవని, అలాగే జనసేన పార్టీ ఆదాయ వనరులు, విరాళాల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి పారదర్శకత ఉండే విధంగా డిజిటల్ ఫండ్ రైజింగ్ క్యాంపైన్ ని జనసేన పార్టీ స్టార్ట్ చేసింది. గతంలో 22.36 కోట్ల వరకు ఉన్న పార్టీ ఆదాయం, తాజాగా విరాళాలతో 26.37 కోట్లకి చేరింది. బ్యాంకులో 7.60 కోట్లు నిల్వ ఉన్నట్లు ఆదాయ వనరులు చూపించడంతో ఎన్నికల కమిషన్ గాజుగ్లాసు గుర్తుని జనసేనకి పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ సమాచారం బయటకి రావడంతో జనసైనికులు మళ్ళీ భయం వదిలేసి గాజుగ్లాసుని ప్రమోట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.