NTR Versity : జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయమై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ పేరు తీసేసి… ‘వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ’గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలను సైతం తయారు చేసింది. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఈ విషయం బయటకు వచ్చింది. గత రాత్రే ఆన్‌లైన్‌లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్ అనుమతి కూడా తీసేసుకున్నట్టు సమాచారం. బుధవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని ఆమోదించగానే… డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా, ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా మారుతుంది.
విజయవాడలో హెల్త్ వర్సిటీ ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1983లో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు… 1986 ఏప్రిల్‌లో వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే ఏడాది నవంబరు 1 నుంచి అడ్మిషన్లు స్వీకరించడం మొదలైంది. అప్పట్లో దీనికి తొలుత పెట్టిన పేరు యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. 1998 ఫిబ్రవరిలో అంటే ఎన్టీఆర్ చనిపోయిన రెండేళ్లకు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఎన్టీఆర్ చొరవతో ఏర్పడిన విశ్వవిద్యాలయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
NTR Versity : వైఎస్సార్ ప్రభుత్వం వర్సిటీ జోలికైతే వెళ్లలేదు..
1998లో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌సగా ఉన్న పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌సగా మార్చుతూ వర్సిటీ యాక్ట్‌ను సవరించారు. అనంతరం కొన్ని రోజులకు ప్రస్తుతం అంతా పిలుచుకుంటున్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా టీడీపీ ప్రభుత్వం పేరు మార్చింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం కూడా వర్సిటీ జోలికైతే వెళ్లలేదు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలైతే తెలియరాలేదు. ప్రస్తుతమైతే ఎలాగైనా పేరు మార్చాలని జగన్ సర్కార్ పట్టుదలతో ఉంది. మరి అసెంబ్లీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.