హనుమాన్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, సంక్రాంతి బరి నుంచి ఓ పెద్ద మూవీ వాయిదా పడుతుందనే నమ్మకంతో హనుమాన్ చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.
తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ఫాంటసీ సూపర్ మ్యాన్ సినిమా ‘హనుమాన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి టీజర్ వరకు ఈ మూవీ ప్రతీ అప్‍డేట్.. అందరినీ బాగా ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠి, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు విదేశీ భాషలైన స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‍లోనూ ఈ చిత్రాన్ని గ్లోబల్‍గా రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించటంతో అంచనాలు మరింత పెరిగాయి. విభిన్న చిత్రాలను తెరకెక్కించి ఇప్పటికే వైవిధ్యమైన డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. హనుమాన్ విడుదల తేదీని చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. అయితే, సంక్రాంతి పోటీ నుంచి ఓ భారీ సినిమా తప్పుకుంటుందనే భరోసాతోనే హనుమాన్ చిత్రయూనిట్ ఈ తేదీని ఖరారు చేసుకుందని టాక్ వినిపిస్తోంది. వివరాలివే..
వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ప్రాజెక్ట్-కే, మహేశ్ బాబు మాస్ సినిమా గుంటూరు కారం, రవితేజ చిత్రం ఈగల్ ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ప్రాజెక్ట్ కే చిత్రాన్ని 2024 జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ గతంలో వెల్లడించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రాజెక్ట్ కే సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ కే షూటింగే పూర్తి కాలేదు. ఆ మూవీ రిలీజ్ తప్పక వాయిదా పడుతుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే చిత్రం 2024 జూన్‍కు పోస్ట్ పోన్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నమ్మకంతోనే హనుమాన్‍ను సంక్రాంతి బరిలో ఆ చిత్ర యూనిట్ దించుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంది. బడ్జెట్ తక్కువైనా ‘హనుమాన్’ కూడా గ్లోబల్ సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ సహా మరో నాలుగు విదేశీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మొత్తంగా 11 భాషల్లో రానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అయితే, ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ 2024 జనవరిలో ఉండదనే భరోసాతో హనుమాన్‍ను సంక్రాంతికి తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది.