భారత్ కి పొరుగున ఉన్న శత్రు దేశాలు అంటే పాకిస్తాన్, చైనా అని చెప్పాలి. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలతో ఇండియాలో అశాంతిని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇక పాకిస్తాన్ ని ఆర్ధికంగా చేయూత ఇస్తూ భారత్ లో అభివృద్ధికి ఆటంకం ఏర్పరచాలని, అలాగే ప్రపంచంలో చైనాతో సమానంలో ఆర్ధిక వృద్ధిలో పరుగులు పెడుతున్న ఇండియాని అడ్డుకోవాలని చైనా భావిస్తుంది. దీనికోసం తనదగ్గర ఉన్న అన్ని రకాల కుయుక్తులని తెరపైకి తీసుకొచ్చి ప్రయోగిస్తుంది. మరో వైపు ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న భారత్ భూభాగాన్ని ఆక్రమించుకొని ఆధిపత్యం పెంచుకోవాలని చైనా కుట్రలు చేస్తుంది. ఈ నేపధ్యంలోనే సరిహద్దులో బేస్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తూ ఇండియన్ ఆర్మీని అన్ని విధాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చైనా ఆర్మీ చేస్తుంది.
గతంలో గల్వాన్ లోయలు ఇండియా, చైనా సైనికుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తుపాకులు వాడకుండా కేవలం రాళ్ళు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ ఘటనలో పదిల సంఖ్యలో ఇండియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే చైనాకిచెందిన 40 నుంచి 50 మంది సైనికులని ఇండియన్ ఆర్మీ జవానులు మట్టుపెట్టారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా దృవీకరించకున్న అక్కడ పత్రికలు మాత్రం ప్రపంచ దృష్టికి తెలిసేలా చేసాయి. తరువాత మళ్ళీ రెండు దేశాల ఆర్మీ అధికారులు శాంతి చర్చలు జరిపారు.
ఆ తరువాత సరిహద్దులో అంతా ప్రశాంతంగానే ఉన్న చైనా మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఇండియన్ జవాన్లని కవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రాంతంలో సరిహద్దు వద్ద చైనా ఆర్మీ భారత్ సైనికులని రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం సృష్టించింది. ఈ ఘర్షణలో ఇండియన్ ఆర్మీకి చెందిన 30 మంది గాయపడ్డట్లు తాజాగా ఆర్మీ బయటపెట్టింది. ఈ ఘటనలో చైనాకి చెందిన సైనికులు తీవ్ర గాయాలకి గురైనట్లు తెలుస్తుంది. ఈ ఘటన డిసెంబర్ 9న జరిగిందని ఇండియన్ ఆర్మీ దృవీకరించింది.