IND vs PAK: దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్‌తో.. భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్లలో.. తటస్థ వేదికల్లో మాత్రమే పాక్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. అయితే వచ్చే ఏడాది ఆసియా కప్ పాక్ వేదికగా జరుగుతుండటంతో.. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది.
ఆసియా కప్‌లో భారత్ ఆడకపోతే.. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌లో తాము ఆడబోమని రమీజ్ పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రజా తేల్చి చెప్పాడు. ‘మా నిర్ణయం చాలా కచ్చితంగా ఉంది.. వాళ్లు(భారత్) ఇక్కడికి వస్తే.. మేం ప్రపంచకప్ ఆడటానికి అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే.. మేమూ వెళ్లం. పాక్ లేకుండానే మెగా టోర్నీ ఆడనివ్వండి. వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో పాక్ ఆడకపోతే.. ఆ టోర్నీని ఎవరు చూస్తారు?. మేం ఆటలో దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నాం’ అని పేర్కొన్నాడు.
మమ్మల్ని ఎవరూ శాసించలేరు: అనురాగ్ ఠాకూర్
రమీజ్ రజా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పరోక్షంగా స్పందించారు. ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని.. తమను ఎవరూ శాసించలేరని స్పష్టం చేశారు. ‘భారత్, పాక్ బోర్డుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై తప్పకుండా స్పందిస్తాం. అయితే సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. ప్రపంచ క్రీడల్లోనే అత్యంత శక్తిమంతమైన దేశం భారత్. ఇతర దేశాలు ఏవీ మాపై అధికారం చెలాయించలేవు’ అని తేల్చి చెప్పారు.
IND vs PAK:
కాగా, 2009లో గడాఫీ స్టేడియం బయట శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం.. ఆ దేశంలో క్రికెట్ ఆడటం ప్రపంచ దేశాలు మానేశాయి. అక్కడ 2009లో నిర్వహించిన ఆసియా కప్పే చివరి మల్టీ నేషనల్ ఈవెంట్. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో 2015లో జింబాబ్వే, 2017లో శ్రీలంక అక్కడ పర్యటించింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా పాక్‌తో క్రీడా బంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే.