Ind v/s NZ: T20 వరల్డ్ కప్ తర్వాత ఇండియాకు తిరిగి రాకుండా అటు నుంచే న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా T20 సిరీస్ 1-0 తేడాతో గెలిచి ఫర్వాలేదని అనిపించినా..వన్డే సిరీస్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. దీంతో తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 221పరుగుల భారీ భాగస్వామ్యంతో కేన్ విలియమ్ సన్, టామ్ లాథమ్
జట్టును విజయ తీరాలకు చేర్చారు. టీమిండియా బ్యాటర్లు రాణించినా బౌలర్లు విఫలంకావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
మొదటగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ జోరు కొనసాగిస్తూ మొదటి వికెట్ 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 124 పరుగుల వద్ద ఇద్దరూ ఫెర్గుసన్, సౌతి బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ చక్కగా బ్యాటింగ్ చేసి 76 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. థర్డ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన రిషబ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ చివరలో సంజూ శాంసన్ (36) ఆటకు వాషింగ్టన్ సుందర్ (37) మెరుపులు తోడవడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
ఇండియాపై అదిరిపోయే రికార్డ్ టామ్ లాథమ్ సొంతం..!
50 ఓవర్లలో 307పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (22), డెవాన్ కాన్వే (24) తక్కువ పరుగులకే అవుటయ్యారు. అయితే, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. స్టేడియం నలువైపులా చక్కని షాట్లతో అలరించారు. విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా.. టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Ind v/s NZ:
కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ లాథమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు ఒకటి, ఉమ్రాన్ మాలిక్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ తమ కెరీర్లో తొలి వన్డే మ్యాచ్ ఆడారు. 2 వికెట్లతో ఉమ్రాన్ మాలిక్ ఆకట్టుకున్నా.. అర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులిచ్చాడు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా 2వ వన్డే 27న హామిల్టన్ లో జరగనుంది.