Ind v/s NZ: నేపియర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో T20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం స్కోరు సమం కావడంతో అంపైర్లు మ్యాచ్ టైగా ముగిసినట్లు ప్రకటించారు. ఈ సిరీస్ లో కేవలము ఒకే ఒక్క మ్యాచ్ పూర్తిగా ఆట సాగింది. ఆ మ్యాచ్ లో ఇండియా నెగ్గడంతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. ఇండియా జట్టు కెప్టెన్ గా హర్డిక్ పాండ్య ట్రోఫీ అందుకోవడం ఇదే మొదటిసారి.
టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫిన్ అలెన్ జతగా డెవాన్ కాన్వే బ్యాటింగ్ కు దిగాడు. ఈ క్రమంలో ఓపెనర్ డెవాన్ కాన్వే (49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 ), గ్లెన్ ఫిలిప్స్ (54) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లు ముగియకుండానే 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. 143 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ తన చివరి 7 వికెట్లను 17 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. బౌలింగ్ లో అర్షదీప్, సిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.
అదరగొట్టిన టీమిండియా పేస్ బౌలర్లు అర్షదీప్, మహ్మద్ సిరాజ్
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లే ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(10), రిషబ్ పంత్ (11) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్(13) ధాటిగా ఆడడానికి ప్రయత్నించి ఇష్ సోధి బౌలింగ్ లో అవుటయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి రన్ రేట్ కాస్త మెరుగ్గానే కనిపించినా వరుసగా వికెట్లు పడడంతో టీమిండియాను కొంత ఆందోళనకు గురి చేసింది.
Ind v/s NZ:
ఓ వైపు కెప్టెన్ హర్డిక్ పాండ్య (18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 30పరుగులు) చేసి క్రీజులో ఉండడంతో మరోవైపు దీపక్ హుడా (9) స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. సరిగ్గా 9 ఓవర్లు ముగిసేసరికి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో 9 ఓవర్లలో టీమిండియా స్కోరు 75-4 ఉండడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం అంపైర్లు మ్యాచ్ ను టైగా ప్రకటించారు. మరొక్క పరుగు ఎక్కువగా చేసి ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. 4 కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.