టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కందుకూరులో రోడ్ షో నిర్వహిస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా మొదటి సారి చంద్రబాబు బహిరంగ సభలో భారీ కార్యకర్తలు తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న డ్రైనేజీలో కార్యకర్తలు ఒక్కసారిగా పడిపోయారు. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. హాస్పిటల్ కి తరలించిన తర్వాత మరో ఐదు మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్యా ఏడుకి చేరింది.
మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైన టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణం సభని రద్దు చేయడంతో పాటు చనిపోయిన వారి కుటుంబాలకి తక్షణ సాయంగా 10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కందుకూరు ఎప్పుడు వచ్చిన ఇక్కడే సభ పెడతానని, తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు.ఒక్కోసారి నిమిత్త మాత్రులుగా మనం మారిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇక గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనతో పోలీసులు కూడా రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. అసలు ఘటన జరగడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై రాజకీయ ప్రముఖులు అందరూ స్పందిస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం హాస్పిటల్ కి వెళ్లి గాయపడ్డవారిని పరామర్శించారు. ప్రస్తుతం కూడా హాస్పిటల్ వద్దనే చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది.