ఈ సారి ఏపీలో రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్యాప్ తమకి అనుకూలంగా మార్చుకోవాలని జనసేన పార్టీ చూస్తుంది. అయితే బలాన్ని పెంచుకోవాలంటే బలమైన వ్యక్తితో పోరాడటమే కాకుండా మరో బలమైన వ్యక్తిని పక్కన పెట్టుకోవాలి అనే ఆలోచనతో జనసేనాని తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో జత కట్టి పొత్తులో కొనసాగుతూ వచ్చారు. అయితే బీజేపీతో జత కట్టడం వలన తనకి ఒరిగింది ఏమీ లేకపోయిన వైసీపీ టీడీపీ వారి మీద చేసిన స్థాయిలో జనసేన కార్యకర్తలని వేధించలేదు అని చెప్పాలి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికారంలో భాగస్వామ్యం కావాలంటే టీడీపీతో జత కట్టి ఎన్నికలకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు.
అలా వెళ్ళడం ద్వారా కొన్ని బలమైన స్థానాలలో గెలవడంతో పాటు క్యాడర్ ని స్ట్రాంగ్ గా చేసుకోవడానికి పునాదులు బలంగా పడతాయి. అదే సమయంలో అధికారంలో భాగస్వామ్యం అయ్యి ప్రజలకి తాను చేస్తానని హామీ ఇచ్చిన పనులు చేయడం ద్వారా సొంతగా బలం పెంచుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఈ సారి అన్ని స్థానాలలో గెలవాలనే జగన్ రెడ్డి కలని వైసీపీ నాయకులు నాశనం చేసేలా ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీనికి కారణం పవన్ కావాలని తన వ్యూహంలో భాగంగా అధికార పార్టీపై కొన్ని బలమైన విమర్శలు చేసి వదులుతున్నారు. అయితే వైసీపీ నాయకుల దగ్గర ఆ విమర్శలకి సమాధానాలు ఉండకపోవడంతో ఎదురుదాడి చేస్తూ బూతులతో రెచ్చిపోతున్నారు.
ముఖ్యంగా అధిష్టానం నుంచి కూడా పవన్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలనే విధంగా నాయకులకి స్క్రిప్ట్ రావడం లేదు. కేవలం ఎదురుదాడి చేసి పవన్ కళ్యాణ్ వెంట నడిచేవారి ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయాలని ఆదేశాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీ నాయకులు అందరూ కూడా అదే ఆదేశాలు అందుకొని విధానపరమైన విమర్శలకి సమాధానాలు చెప్పకుండా అసలు ప్రజలు కూడా భరించలేని రీతిలో బూతులతో రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు.
దీనిని పవన్ కళ్యాణ్ బలంగా ప్రజలకి ప్రాజెక్ట్ చేస్తూ ఇదిగో చూడండి వైసీపీని నేను అభివృద్ధి లేదని ప్రశ్నిస్తే వారు నాకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయని, ప్యాకేజీ తీసుకున్నాడు అంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అనే విధంగా ఫోకస్ చేస్తున్నారు. ఇవి బలంగా ప్రజలకి కనెక్ట్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికలలో ఒక వేళ వైసీపీ ఓడిపోతే మాత్రం కచ్చితంగా అది వైసీపీ నాయకుల కారణం అవుతారనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.