ICC Award: టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అక్టోబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతడితోపాటు జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను ఐసీసీ ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోహ్లీకే ఓటు వేశారు. దీంతో చివరకు కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది. గత ఏడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డును ప్రవేశపెట్టగా కెరీర్‌లో తొలిసారి కోహ్లీ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ టోర్నీతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ అక్టోబరు నెలలో నాలుగు ఇన్నింగ్సులు మాత్రమే ఆడాడు. అయితే నాలుగు మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలతో 205 పరుగులు చేశాడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 82 పరుగులు చేసి తానేంటో మరోమారు క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు. దీంతో ఐసీసీ అవార్డును సొంతం చేసుకుని కోహ్లీ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే 10 ఐసీసీ అవార్డులను గెలుచుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.
కాగా ఈ అవార్డు కోసం విజేతను ప్రతినెలా ఐసీసీ మూడు ఫార్మాట్లలోని ఆటతీరు ఆధారంగా ఎంపిక చేస్తుంది. ముగ్గురు నామినీలను ఆన్ ఫీల్డ్ పనితీరు, నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ కోసం జరిగిన ఓటింగ్‌లో తనను చేర్చడం గౌరవంగా భావిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. అక్టోబరులో అమోఘ ప్రదర్శన ఇచ్చిన ఇతర ఆటగాళ్లను కూడా కోహ్లీ మెచ్చుకున్నాడు.
ICC Award: కోహ్లీకి ఏమైంది?
టీ20 ప్రపంచకప్‌లో భారత విజయాల్లో కీలకంగా మారిన విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. కోహ్లీ వికెట్ల మధ్యలో అలవోకగా రెండు, మూడు పరుగులు చేస్తుంటాడు. అయితే ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ పరిగెత్తడంలో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు పరుగులు చేసి దాదాపు నిమిషం పాటు శ్వాసతీసుకుంటూ గుండెను పట్టుకున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైందని, ఓసారి చెక్ చేసుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.