Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చాలా గుడ్ న్యూస్‌లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పుట్టిన రోజు సందర్భంగా కార్నివాల్ ఉంటుందని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్రపురి కాలనీలో నివశించే సినీ కార్మికుల కోసం మెగాస్టార్ తన తండ్రి కొణిదెల వెంక్రటావు పేరున ఆస్పత్రి కట్టాలనుకుంటున్నట్టు ప్రకటించారు. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ జెర్నీని చిరు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి కట్టాలన్న ఆలోచన తనకు ఎప్పుడో వచ్చిందని.. అది వచ్చినప్పటి నుంచీ దానిపై పనిచేస్తున్నానన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పెట్టగలిగే శక్తి భగవంతుడు తనకు ఇచ్చాడని చిరు పేర్కొన్నారు. ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తే వారికి కూడా అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నానని చిరు పేర్కొన్నారు.. వచ్చే ఏడాదికి పుట్టినరోజుకి ఆ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇంకా చిరు మాట్లాడుతూ.. ‘‘కెరీర్ ప్రారంభంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. నేను పైకి రావాలి.. నా కుటుంబ సభ్యులు బావుండాలి.. విలాసవంతమైన భవంతిలో ఉండాలి, ఖరీదైన కార్లలో తిరగాలి అనుకుంటారు. దానికి తగ్గట్లు కష్టపడి సంపాదిస్తాం. కడుపు నిండుతుంది. మనం, మన చుట్టాలు అంటూ ఆలోచించే ఆ తరుణంలో సంతృప్తి కరువవుతుంది. ఎక్కడైతే తృప్తి ఉండదో అక్కడ మానసిక శాంతి కూడా ఉండదు’’ అని పేర్కొన్నారు.
Chiranjeevi : ప్రత్యుపకారంగా ఏం చేయడం లేదని భావన కలిగింది..
ఇంకా చిరు మాట్లాడుతూ.. ‘‘మానసిక శాంతి కరువైన సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు మన గురించి, మన చుట్టాల గురించి ఆలోచిస్తున్నాం కానీ నిజంగా మనం ఎవరమని చెప్పి ప్రేక్షకులు మనకు ఇంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తున్నారు. ఇంత ప్రేమను మనపై కురిపిస్తున్నారు. మేమంతా పెద్దగా చదివింది లేదు. ఒకవేళ చదువుకు తగ్గ జాబ్‌లోకి వెళ్లుంటే నెలకి లక్షో, రెండు లక్షలో సంపాదించేవాళ్లమంతే! కానీ ఇవాళ్ల మేమంతా రోజుకి లక్షల్లో సంపాదిస్తున్నాం అంటే సినీ పరిశ్రమ మాకు ఇచ్చిన అవకాశమిది. ప్రేక్షకుల మమ్మల్ని ఆదరించడం వల్లనే కదా అనిపిస్తుంది.. ఇలాంటి వారికి మనం ప్రత్యుపకారంగా ఏం చేశాం అని ఆలోచిస్తే.. ఏమి చేయడం లేదనే భావన కలిగింది. నాకూ ఆ భావన కలిగిన రోజే ప్రేక్షకులు, అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. ఆ రోజు నుంచి నా వంతుగా సాయం చేస్తూ వస్తున్నా’’ అని మెగాస్టార్ పేర్కొన్నారు.