Hiccups: మనకు మామూలుగా ఎక్కిళ్లు రావడం అనేది సహజం. శరీరంలోని డయాఫ్రం చికాకుకి గురైనప్పుడు లేదంటే డయాఫ్రంకు నాడీ సంకేతాలు అందనప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే దీనికి కారణం ఎక్కువ కారంగా లేదంటే ఘాటుగా ఉండే ఆహారం తినడం లేదంటే ఆల్కహాల్ తీసుకోవడం లేదా గాలి ఉష్ణోగ్రతలో వచ్చే ఆకస్మిక మార్పు, మానసిక ఒత్తిడి లేదంటే ఉత్సాహం అయి ఉండవచ్చు.
ఎక్కిళ్లు కొద్దిసేపు వచ్చి తర్వాత మాయమవుతాయి. కానీ కొంతమందిలో మాత్రం చాలా సమయం వరకు ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటాయి. దీని వల్ల వారు ఇబ్బందిపడుతుంటారు. వేగంగా నీళ్లు గుటక వేయటం, నిమ్మకాయ ముక్క చప్పరించటం, కాసేపు శ్వాస బిగపట్టటం, మోకాళ్లను ఛాతి దగ్గరకు బిగ్గరగా లాక్కోవటం వంటి చిట్కాలతో ఎక్కిళ్లు తగ్గుతాయి. అయినా తగ్గకపోతే కింది చిట్కాలను పాటించండి.
అల్లం:
ఎక్కిళ్లతో బాధపడే వారు ఉపశమనం కోసం చిన్న అల్లం ముక్కను నిదానంగా నమిలి తినాలి. దీని వల్ల ఎక్కిళ్లు నెమ్మదిగా తగ్గుతాయి.
Hiccups: యాలకుల పొడి:
వంటింట్లో దొరికే యాలకుల నుండి తయారు చేసిన పొడి ఎక్కిళ్లను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించండి. దాన్ని వడపోసి చల్లారిన తర్వాత తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
చక్కెర:
వంటింట్లో ఉండే తీపి పదార్థమైన పంచదార/చక్కెరతో కూడా ఎక్కిళ్లను మాయం చేయవచ్చు. ఒక టీస్పూన్ చక్కెరను నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తే ఎక్కిళ్లు మాయమవుతాయి.