ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం సినిమాలలో తండ్రి పాత్రలు, విలన్ పాత్రలు చేస్తున్న నటుడు సుమన్. అయితే తాజాగా సుమన్ మరణించారు అంటూ నార్త్ కి చెందిన ఒక యుట్యూబ్ ఛానల్ అసత్య కథనాలు ప్రసారం చేసింది. చాలా మంది ఈ కథనాలు నిజమని నమ్మేశారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా చేరి చివరికి సుమన్ దగ్గరకి వచ్చింది. ఈ అసత్య ప్రసారాలపై సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలోతాను క్షేమంగా ఉన్నానంటూఅభిమానులకి, శ్రేయోభిలాషులకి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నానని సుమన్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాను బెంగళూరులో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చానని చెప్పారు. ఉత్తరాది యూట్యూబ్ ఛానల్స్‌లో వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమైనవి. వాటిని చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నిరాధారమైన, ప్రేక్షకులకు ఆందోళనకు గురి చేసే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి మోసపూరిత ఛానళ్లపై పరువు నష్టం దావా వేయబోతున్నానని చెప్పారు. అయితే చాలా న్యూస్ చానల్స్ వ్యూస్ కోసం అనవసరమైన హెడ్డింగ్స్ పెట్టి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, పూర్తి వాస్తవానికి విరుద్ధంగా సొంత వ్యాఖ్యలతో కథనాలు సృష్టించడం చేస్తూ ఉన్నాయి.
గతంలో చాలా యుట్యూబ్ ఛానల్స్ ఇదే తరహాలో కొంత మంది నటులని బ్రతికి ఉండగానే వెంటిలేటర్ ఎక్కించేసాయి. వాటిపై అప్పట్లో ఆయా నటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఏకంగా సుమన్ చనిపోయాడంటూ కథనాలు ప్రసారం చేసేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమన్ చిన్న, పెద్ద తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరో వైపు మార్షల్ ఆర్ట్స్ ని ప్రోత్సహిస్తూ ట్రైనింగ్ సెంటర్స్ కి వెళ్లి అక్కడ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ రెండు ఆయన దినచర్యలో భాగం అయిపోయాయి.