రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 80వ దశకంలో ఏపీలో స్టూవర్టుపురం పరిసరాల్లో సంచలనంగా మారిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కుతుంది. నిజ జీవితంలో దొంగగా ముద్ర వేసుకున్న ఓ పవర్ ఫుల్ హీరోగా అతనిని తెరపై రిప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రేణుక దేశాయ్ చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి రేణుదేశాయ్ క్యారెక్టర్ ని టీజర్ గా రిలీజ్ చేశారు.
తెల్లచీర కట్టుకొని సామాజిక సేవకురాలు హేమలత లవణం పాత్రలో కనిపిస్తుంది. ఇక కళ్ళజోడు, తెల్లచీర కట్టుకొని కనిపిస్తున్న ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ప్రభావితం చేసే పాత్రగా అది ఉండబోతుంది. హేమలత లవణం ప్రముఖ రచయిత గుర్రం జాషువా కుమార్తె అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ లుక్ కూడా మోషన్ పోస్టర్ తో రివీల్ చేశారు.
వెనక నుంచి ట్రైన్ వస్తూ వస్తూ షర్ట్ లేకుండా చేతిలో కొరడాతో టైగర్ నాగేశ్వరావు లుక్ లో రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ బట్టి సినిమాలో మెజారిటీ సన్నివేశాలలో రవితేజ షర్ట్ లేకుండా కనిపిస్తాడని మాట వినిపిస్తుంది. క్యారెక్టర్ ప్రకారం కూడా టైగర్ నాగేశ్వరరావు దొంగతనాలు చేసే సమయంలో ఒంటికి నూనె రాసుకొని, కేవలం పంచె కట్టుకొని వెళ్ళేవాడు అనే ప్రచారం ఉన్న నేపధ్యంలో ఆ క్యారెక్టర్ ని వంశీ కృష్ణ అలాగే డిజైన్ చేశారు. ఈ నేపధ్యంలో మొదటి సారి పూర్తి స్థాయిలో సినిమాలో షర్ట్ లేకుండా కనిపించే పాత్రలో విభిన్నంగా కనిపించబోతున్నాడని అర్ధం అవుతుంది. మరి ఇలాంటి పీరియాడిక్ పాత్రలో అతన్ని ఎంత వరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.