Health Tips: యువతలో చాలా మంది ఎదుర్కొనే సమస్య మొటిమలు. మొటిమలు రావడంతో చాలా మంది ఆవేదన చెందుతూ ఉంటారు. మానసికంగా కూడా కుంగిపోతారు. యుక్త వయసులో హార్మోన్లు, చర్మ సంరక్షణ అలవాట్ల కారణంగా మొటిమలు ఏర్పడతాయి. దీంతో మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు. దీని వల్ల వాళ్లకు తెలియకుండానే చర్మం మరింత పాడవుతుంది.
అయితే మొటిమలు రాత్రికి రాత్రే తగ్గవు. మొటిమలు తగ్గు ముఖం పట్టేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే తిరిగి ముఖ అందాన్ని సొంతం చేసుకోవచ్చు. జిడ్డుగా ఉందని అనిపించినప్పుడు ముఖం కడగడం వల్ల ఫేస్ క్లీన్ అవుతుంది. తద్వారా మొటిమల సమస్య తగ్గుతుంది. ఆహారపు అలవాట్లు కూడా చర్మ సమస్యలపై ప్రభావం చూపిస్తాయి. జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి జంక్ ఫుడ్ తగ్గించి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.
మొటిమలు తగ్గేందుకు వాడే ఉత్పత్తులను చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాలి. జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు ఆయిల్ లేని ఉత్పత్తులు, చర్మ రంధ్రాలను మూసివేయని ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇంట్లో లభించే నెయ్యి, గ్లిజరిన్ వంటివి చర్మానికి హోమ్ రెమిడీస్‌గా పనిచేస్తాయి. రెండు టీస్పూన్‌ల నెయ్యి, నాలుగు చుక్కలు గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకుంటే… మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీంతో చర్మంపై జిడ్డు ఏర్పడదు. అంతేకాకుండా మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.
Health Tips: ఇవి తింటే మొటిమలు వస్తాయా?
కృత్రిమ చక్కెరలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులను తినడం వల్ల మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీటిని దూరంగా పెట్టడమే ఆరోగ్యానికి, అందానికి మంచిది. విటమిన్ ఎ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మొటిమలకు చెక్ పెట్టవచ్చు.