చాలా మంది బరువు తగ్గడానికి ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగుతారు. అంతేకాదు ఈ నీరు తాగడం వల్ల కడుపు కూడా శుభ్రపడుతుంది. అయితే గోరువెచ్చని నీళ్లు కాకుండా వేడి నీళ్లు తాగితే మాత్రం నష్టం తప్పదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. హాట్ వాటర్ తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తపన పడతారు. అందులో భాగంగానే హోం రెమిడీస్ ఫాలో అవుతారు. ఈ క్రమంలోనే వేడి నీరు తాగడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. అయితే చాలా మంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు పొట్ట శుభ్రపడడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగు పరచడానికి గోరువెచ్చని నీటిని తాగుతారు. అంత వరకు బాగానే ఉంది కానీ గోరువెచ్చని నీటికి బదులు సూపర్ హాట్ వాటర్‌ని తీసుకుంటేనే.. ఇతర సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. వేడి నీరు శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి వేడి నీటిని తాగితే అది ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…
వేడి నీరు తాగడం వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. ఇది నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తరచుగా మూత్రవిసర్జన కారణంగా.. నిద్రలేమితో బాధపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రేగులు వంటి అంతర్గత అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే పేగు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని తాగే ముందు నిపుణులను సంప్రదించాలి. అయితే ఎక్కువ వేడిగా ఉన్న నీటిని తీసుకుంటే అది హీట్ స్ట్రోక్ సమస్యను కూడా కలిగిస్తుంది. అలాంటప్పుడు ఎండలోకి వెళ్లేటపుడు సాధారణ నీటిని మాత్రమే తాగాలి. వేడినీటితో నాలుక కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా గొంతు, పెదవులపై కూడా కూడా ఎఫెక్ట్ చూపుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.