Harish Rao: బీజేపీకి కౌంటర్ ఈ రకంగా ఇచ్చిన హరీష్.. ఏపీలో అంశాన్ని లేవనెత్తిన మంత్రి
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతలతో సంబంధాలున్న కొందరు స్వామీజీలు అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి మధ్యవర్తిత్వం వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు కూడా పక్కా ఆధారాలున్నాయని ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా సీఎం కేసీఆర్ కూడా మునుగోడు బహిరంగ సభలో ప్రసంగిస్తూ, బీజేపీపై నిప్పులు చెరిగారు.
మంత్రి హరీష్ రావు తాజగా స్పందిస్తూ, ఓ లా పాయింట్ పట్టారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పారు. ఏపీలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావులను బీజేపీలో విలీనం చేసుకున్న ఘటనను గుర్తు చేశారు హరీష్ రావు.
బీజేపీ చేసిన పని కరెక్టే అయితే, తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్ లో విలీనం కావడం కూడా కరెక్టే అన్నారు హరీష్ రావు. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
Harish Rao: దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అరాచకం సృష్టించారో తెలీదా?
దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో తెలీదా అని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేశారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఏం జరిగిందో పరిశీలించుకోవాలని సూచించారు. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ఇంకోటి అన్నట్లుగా బీజేపీ తీరు ఉందని మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.