Hardik Pandya: దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా ప్రతీకార విజయం సాధించింది. ఒకరోజు ముందే అభిమానులకు దీపావళి పండగను తెచ్చింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ నడిపించిన తీరు ప్రతి అభిమానిని గుండెకు హత్తుకుంది.
చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరమైన దశలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గేర్ మార్చి ఆడిన తీరు చిరస్మరణీయంగా నిలిచింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీ20 క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా పాకిస్థాన్‌పై భారత్‌కు అతిపెద్ద భాగస్వామం. చిరకాల ప్రత్యర్థిపై ఇలాంటి మ్యాచ్‌ను అందించినందుకు టీమిండియాపై అభిమానులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ముఖ్యంగా కోహ్లీ ఈ మ్యాచ్‌లో చూపించిన తెగువను టీమిండియా అభిమానులు మరిచిపోలేరు. సాధారణంగా ప్రతి ఆటగాడికి తనవైన షాట్లు ఉంటాయి. మ్యాచ్ ఆడేటప్పుడు ఆ షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తారు. కోహ్లీవి చాలా వరకు సంప్రదాయ షాట్లే ఉంటాయి. డివిలియర్స్, సూర్యకుమార్ తరహాలో 360 డిగ్రీల కోణంలో అతడు షాట్లు ఆడలేడు. కానీ 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లీ ఆడిన రెండు షాట్లు అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.
Hardik Pandya:
మరోవైపు రన్‌రేట్ పెరుగుతున్నా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఇటీవల ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో ఆరంభ మ్యాచ్ సమయంలో చివరి ఓవర్‌లో బంతి వృథా అయిందని అవతలి బ్యాటర్ కంగారు పడుతుంటే.. భయపడకు నేను చూసుకుంటా అన్నట్లు పాండ్యా ఎంత ధీమాగా కనిపించాడో ఆదివారం టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లోనూ అలాగే కనిపించి మ్యాచ్‌ను గెలిపించాడు.