Harahara Veeramallu Teaser : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. పిరియాడికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కోసం ఒక అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ వదిలింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘దిగొచ్చింది భల్లు భల్లున…పిడుగే దిగొచ్చింది భల్లు భల్లున.. మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు’.. అనే పాటతో పవన్ ఫైట్స్‌ను ఆకట్టుకునేలా చూపించారు.
దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. తిరిగి వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు. అలాగే రీసెంట్‌గా భీమ్లానాయక్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే హిస్టారికల్ సినిమా ద్వారా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొగలాయిలా కాలం నాటి కథతో పవన్ సినిమా చేస్తున్నారు.ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Harahara Veeramallu Teaser : అందుకే సినిమా లేటవుతోంది..
ఇక హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే 60 శాతం పూర్తయిందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో మొదలు పెట్టారు. కానీ పవన్ అటు రాజకీయాలను.. ఇటు సినిమాను బ్యాలెన్స్ చేయాల్సి ఉండటంతో కొంచెం షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ లుక్, గ్లిమ్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కన్నడం, మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.