GVL: ఏపీలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ మూడు రాజధానుల అంశం చుట్టూ తిరుగతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దాడి జరుగుతోంది. అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవెల్లి పాదయాద్ర చేస్తున్న క్రమంలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది జగన్ సర్కార్. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరిపింది. మూడు రాజధానులపై సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పేశారు,.
ఇక అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై అధికార పార్టీ నేతలు విమర్శలతో చెలరేగిపోతున్నారు. అది పాదయాత్ర కాదని దండయాత్ర అంటూ మంత్రులు తిట్టిపొస్తున్నారు. ఉత్తరాంధ్రలో చిచ్చు రేపేందుకు చంద్రబాబు అమారావతి రైతలుతో పాదయాత్ర చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం ఏపీలో మరోసారి దుమారం రేపుతోంది. ఈ క్రమంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మూడు రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. గతంలో మూడు రాజధానులు చెల్లవంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం ఏపీ ప్రభుత్వం స్పషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొంది. రాజధాని మార్చడానికి ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పడం శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పిటిషన్ లో పేర్కొంది. శాసనసభలో చేసిన బిల్లులకు గౌరవం లేదా అని పిటిషన్ లో తెలిపింది.
GVL:
అయితే దీనిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ స్పందించారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదిఅని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న రాజధాని అంశంతో తమకేమి సంబంధం అని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతు కొనసాగుతుందని, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రమై రాజధానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు.